ఒక్కడిగా కాదు.. సొంతంగా పార్టీ పెట్టేస్తాడట!

Mon May 27 2019 11:48:38 GMT+0530 (IST)

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి.. దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నోటి నుంచి ఆసక్తికర ప్రకటన వచ్చింది. తాజాగా ఆయన మాట్లాడుతూ.. బెంగళూరు ప్రజల హక్కు కోసం తన గొంతు వినిపిస్తానని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిలవటంతో తనకు.. ప్రజలకు మధ్య గ్యాప్ వచ్చినట్లుగా పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తాను సొంతంగా పార్టీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన చెప్పారు. ఏడాదిలో బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయని.. ఆ ఎన్ఇనకల్లో తమపార్టీ తరఫున అభ్యర్థుల్ని బరిలో నిలుపుతామనని ఆయన ప్రకటించారు. తాను రాజకీయ పార్టీ పెట్టినా.. సినిమాల్లో మాత్రం నటించటం మాననంటూ స్పష్టం చేశారు.

ఎందుకిలా అన్న ప్రశ్న వేయటానికి ముందే ప్రకాశ్ రాజ్ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేశారు. రాజకీయ పార్టీని నడిపేందుకు డబ్బులు అవసరమవుతాయని.. అందుకోసమే తాను సినిమాల్లో నటించనున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దారుణమైన రీతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ ఏకంగా పార్టీ పెడతానని ప్రకటించి ప్రకాశ్ రాజ్ వార్తల్లోకి వచ్చారు.