టీఆరెస్ నుంచి ప్రకాశ్ రాజ్ పోటీ..షాద్ నగర్ టిక్కెట్?

Sun Apr 15 2018 00:00:00 GMT+0530 (IST)

కొంతకాలంగా బీజేపీపై ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడుతున్న నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఆయన సొంత రాష్ట్రం కర్నాటక నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని చాలామంది భావించినా ఆయన మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే... ఇప్పుడాయన తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పాలక టీఆరెస్ టిక్కెట్ పై షాద్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇటీవలి పరిణామాలు మిగతా సమీకరణాలు అన్నీ దీనికి ఊతమిస్తుండడంతో అందరి నోటా ఇదే వినిపిస్తోంది.
    
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్ మొన్న కర్ణాటకలో జేడీయూ నేత దేవెగౌడను కలిసిన సంగతి తెలిసిందే. అంతకుముందు  ప్రకాశ్ రాజ్ కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసే బెంగళూరు వెళ్లారు. కేసీఆర్ ప్రకాశ్ రాజ్‌ల మధ్య కూడా రాజకీయ  చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన షాద్ నగర్ నుంచి పోటీ చేసే అంశం చర్చకొచ్చినట్లుగా సమాచారం.
    
మరోవైపు ప్రకాష్‌రాజ్ దత్తత గ్రామం సిద్ధాపురం.. అక్కడ ఆయన పొలాలు ఫామ్‌హౌస్ కూడా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో ఆయనకు కొంచెం అనుబంధం ఉంది.  ఈ క్రమంలోనే ఆయన కేసీఆర్ ను షాద్ నగర్ టిక్కెట్ అడిగారని తెలుస్తోంది. కర్ణాటక సొంత రాష్ట్రమైనప్పటికీ తెలుగులో అనేక చిత్రాల్లో నటించి ఇక్కడ ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఇది కూడా ఒక కారణమే. అదేసమయంలో షాద్‌నగర్ ప్రస్తుత ఎమ్మెల్యే గెలుపు అవకాశాలు తక్కువేనని కేసీఆర్ సర్వేలో తేలిందట. ఆయనపై ప్రజల్లో  అసంతృప్తి ఉందని టీఆరెస్ వర్గాల టాక్. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఇక్కడ ప్రతాప్ రెడ్డి పోటీ చేయనుండడంతో ఆయన్ను ఎదుర్కోవడానికి బలమైన ప్రత్యర్థి అవసరం. దీంతో ప్రకాశ్ రాజ్ అభ్యర్థిత్వానికి కేసీఆర్ కూడా సుముఖంగా ఉణ్నారని సమాచారం.
    
సినిమా గ్లామర్ స్థానికులతో టచ్‌లో ఉండడంతో పాటు.. షాద్ నగర్ ప్రాంతంలో కన్నడ ప్రజలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండడంతో ప్రకాశ్ రాజ్ అయితేనే ప్రతాపరెడ్డిని ఓడించగలరని టీఆరెస్ భావిస్తున్నట్లు సమాచారం.