Begin typing your search above and press return to search.

ఒక గాంధీ, ఒక అంబేద్క‌ర్‌..ఒక ప్ర‌కాష్ రాజ్ అట‌!

By:  Tupaki Desk   |   19 Nov 2017 5:45 AM GMT
ఒక గాంధీ, ఒక అంబేద్క‌ర్‌..ఒక ప్ర‌కాష్ రాజ్ అట‌!
X
ఇటీవ‌ల కాలంలో ఓపెన్ గా మాట్లాడే ప్ర‌ముఖ సినీన‌టుల లిస్ట్ పెరుగుతోంది. గ‌తానికి భిన్నంగా మ‌న‌సులో తామేం అనుకుంటున్నారో.. అంతే ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. న‌చ్చిన వాటిని న‌చ్చిన‌వ‌ని.. న‌చ్చ‌నివాటిని అస్స‌లు న‌చ్చ‌లేద‌న్న‌ట్లుగా కుండ బ‌ద్ధ‌లు కొట్టే త‌త్త్వం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది.

ఇలా కుండ బ‌ద్ధ‌లు కొట్టేసే బ్యాచ్ లో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేర్ల‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాశ్ రాజ్ పేరు బ‌లంగా వినిపిస్తోంది. త‌న‌కు మంచి స్నేహితురాలైన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హ‌త్య త‌ర్వాత ప‌లు సామాజిక అంశాల మీద గ‌ళం విప్పుతున్నారు ప్ర‌కాశ్ రాజ్‌.

మోడీ మొద‌లుకొని ఎవ‌రినీ ఏ విష‌యాన్ని ఆయ‌న వ‌దిలిపెట్ట‌టం లేదు. తాజాగా ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాశ్ రాజ్ పై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ గుస్సాగా ఉన్నారంటూ ఇంట‌ర్వ్యూ చేసే పెద్ద‌మ‌నిషి వేసిన ప్ర‌శ్న‌కు ప్రకాశ్ రాజ్ స్పందించారు.

అస‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ నా మీద ఎందుకు కోపంగా ఉండాలో నాక‌ర్థం కావ‌టం లేదు. నేనేం త‌ప్పు చెప్ప‌లేదు క‌దా. ప‌వ‌న్ ఫ్యాన్స్ అయినా.. వేరే వారు ఎవ‌రైనా స‌రే త‌మ‌కున్న వ్య‌క్తిగ‌త అభిమానంతో గుడ్డిగా ఓటు వేయ‌కూడ‌ద‌ని మాత్ర‌మే తాను చెప్పాన‌న్నారు . తానేం ప‌వ‌న్ ను రాజ‌కీయాల్లోకి రాకూడ‌ద‌ని ఏమీ చెప్ప‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

క‌ళ్లు మూసుకొని ఓటు వేస్తే నిల‌దీసే అవ‌కాశం ఉండ‌ద‌ని.. బాధ్య‌త‌గా ఓటు వేయాల‌ని.. అదే స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వారు సైతం ప్ర‌జ‌ల‌కు తామేం చేస్తామ‌న్న విష‌యంపై పూర్తి స్థాయి క్లారిటీ రావాల‌న్నారు.

దేశంలో నిర‌క్ష రాస్యులు ఎక్కువ‌గా ఉన్న చోట మీరు చెప్పే మాట‌లు ఆచ‌ర‌ణ సాధ్య‌మేనా? అన్న ప్ర‌శ్న‌కు స్పందించిన ప్ర‌కాశ్ రాజ్‌.. "ఇప్పుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడ‌టం ఏమిటి? అనుకోవ‌చ్చు. ఎక్క‌డో అక్క‌డ.. ఎవ‌రో ఒక‌రు మొద‌లు పెట్టాలిగా. స్వాతంత్య్ర ఉద్య‌మం కోసం గాంధీ కానీ.. సామాజిక న్యాయం కోసం అంబేడ్క‌ర్ కానీ మార్పు కోసం ప్ర‌య‌త్నించారు. వారు క‌ల‌గ‌న్న‌వేమీ ఇంకా రాలేదు. అలా అని.. అస‌లు వారు ప్ర‌య‌త్న‌మే చేయ‌క‌పోతే ఎలా ఉండేది? మ‌నం ఓటు వేసిన వారంతా గెల‌వాల‌ని లేదు. నేను నిజం మాట్లాడాను. ఒక ప్ర‌య‌త్నం చేశాను. గాంధీ.. అంబేడ్క‌ర్ లు ప్ర‌య‌త్నం చేయ‌క‌పోతే? వారు క‌ల‌గ‌న్న‌వి పూర్తిగా రాలేదు. అలా అని వారు త‌ప్పు అని చెప్ప‌గ‌ల‌మా?" అని ప్ర‌శ్నించారు. మొత్తానికి ఆయ‌న మాటల్లో మార్పుకు -పోరాటాల‌కు అడుగువేసిన తొలి వ్య‌క్తిగా ఆయ‌న చెప్పుకుంటున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అందుకే ఆ పెద్ద వాళ్ల స‌ర‌స‌న త‌న పేరు చేర్చుకుంటున్నార‌ని అనుకోవ‌చ్చా?