Begin typing your search above and press return to search.

హిందువుల‌పై ప్ర‌కాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   18 Jan 2018 4:58 PM GMT
హిందువుల‌పై ప్ర‌కాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్!
X
గౌరీ లంకేశ్ హ‌త్య త‌ర్వాత ప్ర‌కాశ్ రాజ్...మోదీ - బీజేపీల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీ నేత‌ల‌పై, ప్ర‌భుత్వంపై జ‌స్ట్ ఆస్కింగ్ పేరుతో ట్విట్ట‌ర్ లో ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. రాజ్యాంగం నుంచి `సెక్యుల‌ర్` అనే ప‌దాన్ని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేస్తామని కేంద్ర‌మంత్రి హెగ్డే చేసిన వ్యాఖ్య‌లపై ప్ర‌కాష్ రాజ్ నిప్పులు చెరిగారు. దీంతో, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌సంగించిన వేదిక‌ను బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు గోమూత్రంతో శుద్ధి చేయ‌డం సంచ‌ల‌నం రేపింది. తాను వెళ్ళిన చోట‌ల్లా గోమూత్రంతో శుద్ధి చేస్తారా అంటూ ప్ర‌కాశ్ రాజ్ వారిపై సెటైర్ వేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన ఓ స‌భ‌లో ప్ర‌సంగించిన ప్ర‌కాశ్ రాజ్ మ‌రికొన్ని సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. తాను హిందువుల‌కు ఏమాత్రం వ్య‌తిరేకం కాదని - కేవ‌లం మోదీ - అమిత్ షా - హెగ్డేల‌కు మాత్రమే వ్య‌తిరేకమ‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

గౌరీ లంకేశ్ హ‌త్య‌పై ప్రధాని మోదీ స్పందించ‌క‌పోవ‌డంపై ప్రకాశ్‌ రాజ్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన‌ సంగ‌తి తెలిసిందే. తాను మోదీని ప్ర‌శ్నించిన‌పుడు ఆయ‌న మౌనం వ‌హించార‌ని, గౌరీ హ‌త్య‌ను కొంద‌రు సెల‌బ్రేట్ చేసుకున్నార‌ని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల మ‌నుషుల‌పై దాడులు చేసి చంపడం త‌ప్ప‌ని, అలా చంపేవారికి మ‌ద్ద‌తిచ్చేవారు హిందువులు కాద‌ని ప్ర‌కాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక నిజ‌మైన హిందువు....అటువంటి హంత‌కుల‌కు బాస‌ట‌గా నిల‌వ‌డ‌ని అన్నారు. ప్ర‌కాశ్ రాజ్ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ బీజేపీ ప్ర‌తినిధి సాగ‌ర్ రావు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దానికి ప్ర‌కాశ్ రాజ్ ఘాటుగా బ‌దులిచ్చారు. త‌న‌ను యాంటీ హిందూగా పిలిచే వారిని హిందువులు కాద‌ని చెప్ప‌డానికి త‌న‌కు పూర్తి హ‌క్కు ఉంద‌న్నారు. బీజేపీపై తాను చేస్తున్న వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో జాగ్ర‌త్తగా ఉండాల‌ని కొంతమంది త‌న‌కు సూచిస్తున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. అయితే, త‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి హెచ్చ‌రికలు రాలేద‌న్నారు. త‌న‌పై ప్ర‌త్య‌క్ష దాడులు చేయ‌లేద‌ని, అయితే, ప‌రోక్షంగా కొంద‌రు త‌న సినిమాల‌ను, యాడ్స్ ను అడ్డుకోవాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించారు. ఇటువంటి వాటికి భ‌య‌ప‌డ‌న‌ని, వారు ఎంత దూరం వెళ‌తారో చూద్దామ‌ని వ్యాఖ్యానించారు.