Begin typing your search above and press return to search.

నెహ్రూ, పటేల్, బోస్‌ లను బ్రిటిష్‌ వాళ్లు ఉరితీశారా?

By:  Tupaki Desk   |   24 Aug 2016 9:25 AM GMT
నెహ్రూ, పటేల్, బోస్‌ లను బ్రిటిష్‌ వాళ్లు ఉరితీశారా?
X
బీజేపీ అనగానే దేశభక్తికి మారుపేరని.. చరిత్ర వారి నాలుకల మీద ఉంటుందని చెబుతుంటారు. కానీ... సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రే తప్పుల తడకలు మాట్లాడి ఆ తరువాత నాలిక్కరుచుకున్నారు. అదికూడా విద్యా శాఖ వ్యవహారాలు చూసే మానవ వనరుల మంత్రి జవదేకర్ ఇలా తప్పులుతడకలు చెప్పడం విమర్శలకు దారితీస్తోంది. భగత్‌ సింగ్ - రాజ్‌ గురులతో పాటుగా జవహర్‌ లాల్ నెహ్రూ - సర్దార్ వల్లభాయ్ పటేల్ - సుభాష్ చంద్రబోస్‌ లను కూడా బ్రిటిష్‌ వాళ్లు ఉరితీశారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మధ్యప్రదేశ్‌ లోని చింద్వారాలో తిరంగా యాత్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం జరిగిన ఒక బహిరంగ సభలో జవదేకర్ మాట్లాడుతూ ‘1857లో ప్రారంభమైన స్వాతంత్య్ర పోరాటం 90 ఏళ్ల తర్వాత బ్రిటిష్ వారిని తరిమికొట్టడంతో ముగిసింది. బ్రిటిష్ పాలకులు ఉరితీసిన పండిట్ జవహర్‌ లాల్ నెహ్రూ - సర్దార్ వల్లభాయ్ పటేల్ - నేతాజీ సుభాష్ చంద్రబోస్ - భగత్ సింగ్ - రాజ్‌ గురులాంటి అమరవీరులకు మనం ఇప్పుడు జోహార్లు అర్పిస్తున్నాం’ అని అన్నారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయ.

దేశ తొలి ప్రధాని అయిన జవహర్‌ లాల్ నెహ్రూ 1964లో 74 ఏళ్ల వయసులో సహజ అనారోగ్యం కారణంగా మరణించగా - భారతదేశ తొలి హోం మంత్రి అయిన సర్దార్ పటేల్ 76 ఏళ్ల వయసులో 1950లో చనిపోయారు. ఇక సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న తైపీలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో మరణించినట్లు చెబుతున్నా ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలి పోయింది. కానీ జవదేకర్ వీరందరినీ బ్రిటిషోళ్లు ఉరితీశారని చెప్పుకొచ్చారు. అయితే.. తన వ్యాఖ్యలపై జవదేకర్ మంగళవారంవివరణ ఇచ్చారు. అలవాటు ప్రకారం నేరం మీడియాపై మోపేశారు. 1857నుంచి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారికందరికీ నివాళులర్పించానని.. ఈ క్రమంలో మొదట తాను గాంధీజీ - నెహ్రూ - పటేల్ - సుభాష్ చంద్ర బోస్‌ లను ప్రస్తావించానని తెలిపారు. ఆ తరువాత ఉరితీయబడిన, జైల్లో పెట్టిన, బ్రిటిష్‌ వారి చేతిలో చిత్రహింసలు అనుభవించిన వారి గురించి ప్రస్తావించానని ఆయన స్పష్టం చేశారు.