Begin typing your search above and press return to search.

అవిశ్వాసం వేళ...తాయిలాల గోల

By:  Tupaki Desk   |   19 July 2018 5:20 AM GMT
అవిశ్వాసం వేళ...తాయిలాల గోల
X
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన 24 గంటలలోపే కేంద్రం వరాల జల్లు కురిపించింది. విభజన అనంతరం ప్రభుత్వాలు ఏర్పడి నాలుగేళ్లు గడచినా ఏమి పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా దిద్దుబాటు చర్యలకు సమాయత్తమైంది.

ఆంధ్రప్రదేశ్‌ లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పచ్చజండా ఊపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ టిట్వర్‌ లో వెల్లడించారు. సెంట్రల్ యూనివర్సీటీస్ బిల్ 2018 కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన చట్టంలో ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం అనంతపురం జిల్లా జంతలూరులో 2015లో 491.23 ఎకరాల భూమి కేటాయించింది. ప్రహారి గోడ నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. మూడేళ్ల క్రితమే ఇవన్నీ సిద్దమైనా కేంద్రం మాత్రం ఉలుకు పలుకు లేనట్లుగా ఉంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోక్‌ సభ సభ్యుల రాజీనామాలు - ఏపిలో ప్రజాందోళనలతో కంగుతిన్న బిజేపి ప్రభుత్వం ఈ హడావుడి కేటాయింపుకు సిద్ధమైంది.

కేంద్రం ప్రకటించిన విశ్వవిద్యాలయం మరో రెండు నెలలలో ప్రారంభమవుతుందని - విద్యార్దుల క్లాసులు కూడా ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి జవదేకర్ ప్రకటించారు. నాలుగు సంవత్సరాలుగా అంగుళం కూడా కదలని ఈ విశ్వవిద్యాలయ పనులు రెండు నెలలలో ఎలా పూర్తవుతాయో కేంద్రానికే తెలియాలి. అవిశ్వాస తీర్మాన సంధర్భంగా జరిగే చర్చలో తాము ఇన్నీ పనులు చేసామని సభలో చెప్పుకుందుకు తప్ప ఈ విశ్వవిద్యాలయ ఏర్పాటు మరింకెందుకూ పనికిరాదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్ధల కేటాయింపు, ప్రహారి గోడకు నిధులు వంటి పనులు చేసిందే తప్ప విశ్వవిద్యాలయ ఏర్పాటుకు మాత్రం కేంద్రంపై ఎలాంటి వొత్తిడి తీసుకు రాలేదు. ఈ నాలుగేళ్లూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుపై పెదవి విప్పలేదు. అటు భారతీయ జనతా పార్టీ - ఇటు తెలుగుదేశం ప్రభుత్వం ఇన్నాళ్లూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి చివరి సమయంలో ఇలాంటి కీలక నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడమే.