100 కోట్ల ఆఫర్ పై జవదేవకర్ రియాక్షన్

Wed May 16 2018 17:11:17 GMT+0530 (IST)

జేడీఎస్ నేత..మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు కుమారస్వామి చేసిన తీవ్రమైన ఆరోపణపై బీజేపీ నేత.. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రియాక్ట్ అయ్యారు. తమ పార్టీని చీల్చి.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు.. మంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లుగాచెప్పిన దాన్లో ఎంతమాత్రం నిజం లేదని మండిపడ్డారు. రూ.100 కోట్లు ఊహించుకోవటమే కష్టమని.. ఇలాంటి ఆరోపణలతో జేడీఎస్.. కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు.తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని.. తమకు మద్దతు ఇచ్చే వారి పేర్ల జాబితాను ఇప్పటికే గవర్నర్ కు వచ్చినట్లుగా చెప్పారు. కుమారస్వామి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. తాము కచ్ఛితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తమపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జవదేకర్.. జేడీఎస్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీనే దిట్టగా ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవటం ఇష్టం లేదని.. కుమారస్వామిని సీఎం చేయటం వారికి ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. ప్రకాశ్ జవదేకర్ మాటల్ని చూసినప్పుడు చీలిక వస్తే గిస్తే జేడీఎస్ నుంచి కాకుండా కాంగ్రెస్ నుంచే వస్తుందన్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీతో జత కట్టేందుకు జేడీఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తొలుత వార్తలు వచ్చినా.. ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యల్ని చూస్తే.. కాంగ్రెస్ కు చెందిన లింగాయత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరు.. కాంగ్రెస్ గోడ ప్రమాదం ఉందన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వాదనకు బలం చేకూరేలా కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటం హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి రాకపోవటంపై కాంగ్రెస్ పార్టీ నేత పరమేశ్వర క్లారిటీ ఇచ్చారు. సమావేశానికి రాని 12 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారన్నారు. కొందరు ఎమ్మెల్యేల ఫ్లైట్లు ఆలస్యం కావటంతో టైంకు రాలేకపోయారన్నారు. జేడీఎస్ కు షరతులు లేని మద్దతు ఇచ్చామని.. ఉప ముఖ్యమంత్రి పదవిని అడగలేదని స్పష్టం చేశారు. మరి.. ఏ ధైర్యంతో జవదేకర్ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.