Begin typing your search above and press return to search.

తప్పు చేసినందుకు ఎండ‌లో నిల‌బడ్డ ప్ర‌జాప్ర‌తినిధి

By:  Tupaki Desk   |   24 Nov 2015 8:17 AM GMT
తప్పు చేసినందుకు ఎండ‌లో నిల‌బడ్డ ప్ర‌జాప్ర‌తినిధి
X
ప్రజా ప్ర‌తినిధులు అంటే ఎలా ఉంటారు? తామేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది వారి ధీమా. ప్ర‌భుత్వ సొమ్మును వాడుకోవ‌డంలో ముందువ‌రుస‌లో ఉండేది వారే. అలాంటి నాయ‌కులు పార‌ద‌ర్శ‌క‌త గురించి మాట్లాడటం బాగానే ఉంటుంది కానీ వారి చేత‌లు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. మ‌న‌ దేశంలో రాజ‌కీయ నాయకులు, ప్రజాప్ర‌తినిధులుగా ఎంపిక‌యిన వారికి జ‌నం సొమ్మును తిన‌డంపై పూర్తి హ‌క్కు ఉంద‌ని భావిస్తుంటారు. ఒక‌వేళ వారి అక్ర‌మాల‌పై కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తే....దురుద్దేశపూర్వ‌కం అని చెప్తారు. ఆరోప‌ణ‌లు కోర్టులో తేలినా త‌మ‌దైన శైలిలో మ‌సిపూసి మారేడు కాయ చేస్తారు.

ఇందుకు పూర్తి భిన్నంగా ఓ ప్ర‌జా ప్ర‌తినిధి వ్య‌వ‌హ‌రించారు. త‌ప్పును ఒప్పుకోవ‌డ‌మే కాదు...త‌న‌దైన శైలిలో శిక్ష విధించుకున్నారు. ప్రకాశం జిల్లా ప‌రిష‌త్ చైర్మన్ హరిబాబు ప్రభుత్వ వాహనాన్ని తన సొంత అవసరాలకు ఉపయోగించుకున్నాడ‌ని జెడ్పీ స‌భ్యులు ఆరోపించారు. సభ్యుల ఆరోప‌ణల‌తో క‌ల‌త చెందిన హ‌రిబాబు ఆ ఆరోప‌ణ‌ల‌పై తాజాగా భిన్న‌మైన రీతిలో స్పందించ‌డ‌మే కాదు ఏకంగా శిక్ష విధించుకున్నారు.

మ‌ధ్యాహ్న భోజన విరామ సమయంలో జెడ్పీ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో హ‌రిబాబు ఎండలో నిలబడి ఉండిపోయారు. ప్రభుత్వ వాహనాన్ని సొంత అవసరాలకు వినియోగించుకోవ‌డం ద్వారా తాను తప్పు చేశానని చెబుతూ అందుకే త‌న‌కు తాను శిక్ష వేసుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి ప‌రిస్థితులు పున‌రావృత్తం కాకుండా చూసుకుంటాన‌ని చెప్పారు. మొత్తంగా కొత్త సంప్ర‌దాయానికి హ‌రిబాబు తెర‌తీశార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.