Begin typing your search above and press return to search.

స‌న్నాసుల‌ని తిట్టి కేసీఆర్ నోరు జారారా?

By:  Tupaki Desk   |   12 Oct 2017 7:15 AM GMT
స‌న్నాసుల‌ని తిట్టి కేసీఆర్ నోరు జారారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఆగ్ర‌హం వ‌చ్చినా.. అనుగ్ర‌హం వ‌చ్చినా ఒక రేంజ్లో ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. గ‌తంతో పోలిస్తే.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌నలో ఆత్మ‌విశ్వాసం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇబ్బందేమంటే.. మితిమీరిన‌త‌నం ఎక్కువ కావ‌ట‌మే ఇబ్బంది. విష‌యం ఏమైనా వెంట‌నే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసి.. నోరు పారేసుకోవ‌టం కొన్నిసార్లు క‌లిసి వ‌చ్చినా.. అన్నిసార్లు క‌లిసిరాద‌న్నది కేసీఆర్ గుర్తిస్తే మంచిది.

తాజాగా సిరిసిల్ల‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ సంద‌ర్భంగా ఆయ‌న తొంద‌ర‌ప‌డి అన్న మాట కేసీఆర్ వైపు వేలెత్తి చూపేలా ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగిస్తున్న వేళ‌.. క‌రెంటు పోయింది. అంతే.. శివాలెత్తిన ఆయ‌న‌.. రాష్ట్రంలో ఎక్క‌డా క‌రెంటు పోత‌లేదు.. సిరిసిల్ల‌లో పోయింది.. మీ ద‌గ్గ‌ర స‌న్నాసులు ఉన్నారు.. వాళ్ల‌ను మంచిగా చేసుకోవాలె అంటూ నోరు జారారు.

కేసీఆర్ మాట్లాడుతున్న వేళ‌.. క‌రెంటు పోవ‌టంతో స‌భ‌లో ఒక్క‌సారి నిశ్శ‌బ‌ద్ధం అలుముకుంది. దీంతో చిరాకెత్తిన ఆయ‌న అస‌హ‌నంతో మాట అనేశారు. ఆ వెంట‌నే జ‌న‌రేట‌ర్ మొద‌లు కావ‌టంతో త‌న ప్ర‌సంగాన్ని కంటిన్యూ చేసిన ఆయ‌న‌.. న‌న్నే తిప్ప‌లు పెట్టారు.. మిమ్మ‌ల్ని కూడా తిప్ప‌లు పెడుతున్నారా? అన్న ప్ర‌శ్న‌ను వేయ‌గా.. క‌రెంటు పోవ‌టం లేద‌ని ప్ర‌జ‌లు బ‌దులిచ్చారు.

దీంతో.. తానే తొంద‌ర‌ప‌డిన విష‌యాన్ని కేసీఆర్‌ గుర్తించిన‌ట్లుగా క‌నిపించింది. అయితే.. నేనొచ్చిన‌ప్పుడు గిట్ల‌యిందా అంటూ న‌వ్వేయ‌టంతో స‌భ ఒక్క‌సారి మామూలైంది. ఇంత‌కీ జ‌రిగిందేమంటే.. స‌భ ఏర్పాటు చేసిన జూనియ‌ర్ కాలేజీలో భ‌ద్ర‌తా కార‌ణాలతో విద్యుత్ తీగ‌ల్ని తొల‌గించారు. దీంతో.. ఉద‌యం నుంచి క‌రెంటు లేదు. జ‌న‌రేట‌ర్ల ద్వారా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేశారు. కాకుంటే.. కేసీఆర్ మాట్లాడే స‌మ‌యంలో జ‌న‌రేట‌ర్ ఆగ‌టంతో కేసీఆర్ నోటి నుంచి స‌న్నాసులన్న మాట వ‌చ్చేసింది. త‌మ త‌ప్పు లేకున్నా.. అవ‌గాహ‌న లేక సీఎం కేసీఆర్ నోరు జారార‌న్న ఆవేద‌న‌ను విద్యుత్ అధికారుల్లో వ్య‌క్త‌మైంది. ఇలాంటి నోటి జారుడు మాట‌లు కేసీఆర్ లాంటి నేత ఇమేజ్‌ ను డ్యామేజ్ చేస్తాయ‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిది.