Begin typing your search above and press return to search.

చంద్రబాబు వల్ల కమ్మ ఐడెంటీకి దెబ్బ

By:  Tupaki Desk   |   12 Dec 2018 6:54 AM GMT
చంద్రబాబు వల్ల కమ్మ ఐడెంటీకి దెబ్బ
X
నీతి నిజాయితీ, మానవత్వం మనుషుల్లో ఉంటే 100శాతం కేసీఆర్ గెలుస్తాడని తాను అనుకున్నానని.. అనుకున్నట్టే తెలంగాణ ప్రజలు నిరూపించారని విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. తెలంగాణ ప్రజల కాళ్లకు, చేతులకు మొక్కుతున్నానని.. కుట్రలు, కుతంత్రాలు, చేధించి కేసీఆర్ ను గెలిపించారని కొనియాడారు. సాటి మనిషిని గౌరవించే స్వభావం తెలంగాణ ప్రజల్లో ఉందని.. తాను తొలి నుంచి కూడా చెబుతున్నానన్నారు. తెలంగాణ ప్రజలకు గొప్ప మానవత్వం ఉండబట్టే కేసీఆర్ ను గెలిపించారన్నారు. తాను జీవితంలో మొదటి సారి కేసీఆర్ గెలవాలని కోరుకున్నానని.. తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్నానని.. పోసాని అన్నారు.

తెలంగాణపై సైంధవుడిలాగా చంద్రబాబు డబ్బుల కట్టలతో తెలంగాణపై దాడి చేశాడని.. శేరిలింగంపల్లి ఆనందప్రసాద్ 75 లక్షలు దొరికిన మాట వాస్తవం కాదా అని పోసాని ప్రశ్నించారు. మరోచోట 3 కోట్లు పడ్డుపడ్డాయని.. తెలంగాణలో ఇలా డబ్బు వెదజల్లాడానికి చంద్రబాబే కారణమని అన్నారు. చంద్రబాబు లాంటి కుట్రదారు తిమ్మిని బమ్మి చేయగల సమర్ధుడు అని.. ఇలానే చేసి కేసీఆర్ ను ఓడిస్తాడని అనుకున్నానని పోసాని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు తీరుతో కమ్మవాళ్ల పరిస్థితి అంటరాని వాళ్లగా మారిందని దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. చంద్రబాబు నాయుడు తమ కులస్థుడే అయినా ఆయన వల్ల తమ కులానికి చెడ్డపేరు వస్తుందని వాపోయాడు. చంద్రబాబు చీప్ ట్రిక్స్, ఆయన వ్యవహార శైలితో తమ కులం పరువు తీస్తున్నాడని.. అందుకే కమ్మ వాళ్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని.. చంద్రబాబు నాయుడు కమ్మ కాబట్టి ఆయనకే ఓటేస్తాం.. అనే తీరు మార్చుకోవాలని కోరాడు. ఆయన వల్ల కమ్మ కులం ఐడెంటీని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

కమ్మ అభిమానం వ్యక్తిగతంగా ఉంచుకోవాలని కులస్థులకు పోసాని సూచించారు. జగన్ ను ఆయన తల్లి, చెల్లే హత్య చేయించేందుకు ప్రయత్నించారని మనిషి అనే వాడు ఎవడైనా ఉంటారా అని ప్రశ్నించారు. కానీ చంద్రబాబు కింద పనిచేస్తున్నారు కాబట్టి ఇలాంటి దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని పోసాని విమర్శించారు.

బాలక్రిష్ణ తన తండ్రిని చంపిన చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడని.. ఇప్పుడు సుహాసినిని కూడా లాగి ఆమెను బలిపశువు చేశాడని పోసాని ఆరోపించారు. సొంత తండ్రికి వెన్నుపోటు పొడిచోనిడిని, తండ్రిపై చెప్పులు వేసినోడిని ఏమీ చేయలేని బాలక్రిష్న కేసీఆర్ తాటా తీస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలోని కమ్మ, రెడ్లు మనవత్వంతో ప్రవర్తించి ఎవరైతే తమకు అండగా నిలుస్తారో వారికే ఓటేశారని.. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్రావారిపై దాడులు చేయలేదని.. గొప్పగా తమను కడుపులో పెట్టుకొని చూశారని అన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి కుయుక్తులు ఓడిపోయాయని, ఏపీలో కూడా అదే జరుగాలని తాను కోరుకుంటున్నానని పోసాని స్పష్టం చేశాడు. అంతేకాదు ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావాలనేది తన ఆశ అని అదే త్వరలో నెరవేరబోతుందని పోనాని తెలిపారు. తెలంగాణ ఫలితాలు వెల్లడయ్యే ముందు తను కూడా కొంతమేర ఒత్తిడికి లోనయ్యానని అందుకు కారణం చంద్రబాబు నాయుడే అన్నారు.

ఆంధ్రాలో టీఆర్ఎస్ వచ్చి పోటీచేసినా.. ఆంధ్రా వరకు మాత్రం తాను జగన్ కే సపోర్టు చేస్తానని పోసాని అన్నారు. ఆంధ్రాలో చంద్రబాబుకు కులగజ్జితో ఓటేస్తే రాబోయే కాలంలో కమ్మవాళ్లు సభ్య సమాజానికి దూరంగా బతకాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను కమ్మ వాడినేనని.. బాబు వల్ల కమ్మ వాళ్లు అంటరాని వాళ్లుగా బతుకుతున్నారని పోసాని విమర్శించారు.

‘కేసీఆర్ ఏం నా కులపోడు కాదు.. నాకు తెలిసిన వాడు కూడా కాదని.. నేప్పుడూ ఆయన్ను డైరెక్టుగా కూడా చూలేదు’ అయినా కేసీఆర్ గెలువాలని మొక్కుకున్నానని అదే జరిగిందని తెలిపారు. కేసీఆర్ గెలవాలని.. అమ్మవారికి పట్టుచీర పెట్టా.. వేంకటేశ్వరస్వామికి పట్టుబట్టలు, సాయిబాబాకు శాలువా మొక్కు చెల్లించా అంటూ పోసాని వివరించారు. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి సైంధవుడిగా వ్యవహరించారని పోసాని అన్నారు. వీళ్ల కుయుక్తులతో కేసీఆర్ ఓడిపోతామోనని భయపడ్డానని అందుకే దేవుడిని మొక్కు చెల్లించానని పోసాని వివరించారు.