Begin typing your search above and press return to search.

కేసీఆర్ 400 కిలోల ఆర్డీఎక్స్‌ తో సమానం

By:  Tupaki Desk   |   13 Dec 2018 5:59 PM GMT
కేసీఆర్ 400 కిలోల ఆర్డీఎక్స్‌ తో సమానం
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై ప్రముఖ సినీ రచయిత - నటుడు పోసాని కృష్ణమురళి ప్రశంసల వర్షం కురిపించారు. జనం నుంచి పుట్టిన నాయకుడు కేసీఆర్ అని - క్రెడిబులిటీ ఉన్న లీడర్ అని - దేశంలోనే బెస్ట్ సీఎం అని కితాబిచ్చారు. సీఆర్ స్థానంలో చంద్రబాబు ఉండి ఉంటే సెటిలర్లంతా ఏపీకి పారిపోయి ఉండేవారని ప్రముఖ సినీ రచయిత - నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. చంద్రబాబు.. క్రెడిబులిటీ లేని నాయకుడు అని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుల వల్లే దేశంలోని వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయని ఆరోపించారు. ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్రస్తుత రాజకీయలపై పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటే తనకు ఎందుకు ఇష్టమో - అభిమానమో తెలిపారు. కేసీఆర్‌ తనకు ఆరాధ్య నాయకుడు కావడానికి గల కారణాలను తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలవాలని దేవుడిని ఎందుకు ప్రార్థించారో వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను ప్రశంసలతో ముంచెత్తారు. కేసీఆర్ బక్కగా - 40 కిలోలు ఉంటారు - కానీ. 400 కిలోల ఆర్డీఎక్స్‌ తో సమానం అన్నారు. బ్లాస్ట్ అయితే ఇండియా మొత్తం పేలిపోతుందన్నారు. తెలంగాణలో ప్రజలు సుఖంగా ఉన్నారు అంటే.. దానికి కేసీఆరే కారణం అన్నారు. తెలంగాణను మరింతగా అభివృద్ది చేసే సత్తా - బంగారు తెలంగాణగా మార్చే శక్తి కేసీఆర్‌ కు మాత్రమే ఉందని పోసాని స్పష్టం చేశారు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల తెలంగాణ రాలేదని - కేసీఆర్ పోరాటం చేసి - తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను తెచ్చుకున్నారని పోసాని చెప్పారు. రైతు బంధు - పెన్షన్లు - కంటి వెలుగు - కళ్యాణ లక్ష్మి - మిషన్ భగీరథ లాంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేవన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలతో పోసాని విరుచుకుపడ్డారు. కేసీఆర్ - చంద్రబాబు మధ్య ఉన్న తేడాతో ఏంటో చెప్పారు. చంద్రబాబులా.. కేసీఆర్ తన గురించి తాను ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదన్నారు. ప్రజలకు ఏం అవసరమో అది చేస్తారని అన్నారు. చంద్రబాబులా.. అది నేను కట్టా.. ఇది నేను కూల్చా అని కేసీఆర్ గొప్పలు చెప్పరని పోసాని అన్నారు. కేసీఆర్‌కు ప్రజల కష్టాలు తెలుసని - ఆయన ప్రజల మనిషి అని - అందుకే కేసీఆర్‌ కు అభిమానిగా మారానని చెప్పారు. గుంటూరు నుంచి వచ్చి తాను తెలంగాణలో బతుకుతున్నానని - 30ఏళ్లుగా ఇక్కడే సంతోషంగా ఉంటున్నట్టు పోసాని చెప్పారు. ఈ 30ఏళ్లలో ఏ తెలంగాణ బిడ్డ కూడా తనపై చెయ్యి వెయ్యలేదని - తనపై దాడి చేయలేదని - దౌర్జన్యంగా ప్రవర్తించలేదని - భూములు లాక్కోలేదని.. దీనికి కారణం కేసీఆర్ పాలనే అని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే తెలంగాణలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ సర్వీస్ చేస్తే చంద్రబాబు బిజినెస్ చేశారని పోసాని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డలు మానవత్వం ఉన్నవాళ్లు, మంచి వాళ్లు అని పోసాని అన్నారు.