Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు పెరిగిపోతున్న సినీ ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   23 Oct 2016 11:11 AM GMT
కేసీఆర్‌ కు పెరిగిపోతున్న సినీ ఫ్యాన్స్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు సినీ ఇండ‌స్ట్రీ నుంచి ఊహించ‌ని మ‌ద్ద‌తు ద‌క్కుతోంది. కొద్దికాలం క్రితం ఓ వెట‌రన్ హీరోయిన్ త‌న‌కు టీఆర్ ఎస్‌ లో చేరాల‌నే ఆస‌క్తిని బ‌య‌ట‌పెట్ట‌గా..తాజాగా కేసీఆర్‌ పై సినిమా తీయ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు మ‌ధుర శ్రీ‌ధ‌ర్ ప్ర‌క‌టించారు. ఇదే కోవాలో కేసీఆర్‌ పై త‌న‌కున్న అభిమానాన్ని సినీ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చాటుకున్నాడు.

కేసీఆర్ తెలంగాణ కోసం కష్టపడ్డ ఏకైక నాయకుడని, త‌న‌ దృష్టిలో కేసీఆర్‌ ఎవరెస్ట్ అని పోసాని ప్ర‌శంసించారు. కేసీఆర్‌ కు అంత పోరాడాల్సిన అవసరం లేన‌ప్ప‌టికీ దీక్ష చేపట్టి తెలంగాణ సాధించాడని కొనియాడారు. వార‌సులైన‌ కేటీఆర్ - కవితని చూసుకుంటూ ఉండిపోవచ్చు కానీ అలా చేయ‌డం లేద‌ని పోసాని విశ్లేషించారు. మిషన్ భగీరథ - మిషన్ కాకతీయలాంటి ఎన్నో మంచి పథకాలను చేపట్టి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని ప్ర‌శంసించారు. జిల్లాలు - మండలాలు విడదీసి కూడా మంచి పనిచేశారని, ఇకముందు అన్ని పనులు బాగా చేస్తారనే నమ్మకం ఉందని భ‌రోసా వ్య‌క్తం చేశారు. ఏ పార్టీ వచ్చినా ప్రజల కోసమేన‌ని ఎంతమంది వస్తే అంత మంచి జరుగుతుందని ఇది ఆహ్వానించదగ్గ విషయమే కదా అంటూ వివ‌రించారు.తాను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని చిరంజీవిగా పిలిచారని తాను ప్రజారాజ్యంలో అడుగుపెట్టాన‌ని వివ‌రించారు. తాను ప్ర‌చారం చేశానే త‌ప్ప ఏ నియోజకవర్గం నుంచి నిలబడ లేదని వివ‌రించారు. త‌న‌కు తప్పనిపిస్తే ఏదైనా మాట్లాడతని చెప్పిన పోసాని కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక బహిరంగ లేఖ రాశాన‌ని గుర్తు చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌కే తాను ఓటు వేశాన‌ని పేర్కొంటూ అలా అని నేను పార్టీలోకి వెళతానని కాదని పోసాని స్ప‌ష్టం చేశారు.

ఇటీవ‌ల ఓ టీవీ చాన‌ల్ డిబేట్‌ లో ఎంపీ వీహెచ్‌ తో జ‌రిగిన దురుసు సంభాష‌ణ‌పై పోసాని సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు."నాకు వీ హ‌నుమంత రావు అంటే గౌరవం. పద్దెనిమిదేళ్లు పార్లమెంటులో ఎంపీగా ఉన్న పెద్ద మనిషి. ఆయనకు తన పార్టీ పట్ల అభిమానం ఉండొచ్చు, ఉండాలి కూడా. సిన్సియర్ కాంగ్రెస్ లీడర్. నేను ఏ పార్టీకి సిన్సియర్ కాదు. నేను భారతదేశానికి సిన్సియర్‌ ని. భారతదేశ ప్రధాని సీటులో ఎవరు కూర్చున్నా.. అతని గురించి మంచిగా మాట్లాడాల్సిన అవసరం, బాధ్యత మనకుంది. ఆ సీటులో ఎంత సమర్ధుడు, ఎంత నిజాయితీపరుడు కూర్చుంటే మనదేశానికి అంత మంచి జరుగుతుంది. నేను టీవీ షోలో ప్రధానమంత్రి గారిని పొగిడా. లోకమంతా ఏమంటుందో నేను అదే అన్నా. ఆయన నన్ను మోదీని బయటకు వెళ్లి పొగుడుకోపో అన్నారు. దానికి నేను మాట్లాడతానని చెప్పా. ఆయన వినిపించుకోలేదు. నేను మాట్లాడేటప్పుడు మీరు కామ్‌గా ఉండండి, మీరు మాట్లాడేటప్పుడు నేను కామ్‌గా ఉంటానని చెప్పా. ఆయన వినిపించుకోలేదు. పైగా నన్ను అరేయ్, ఒరేయ్ రెండుసార్లు, మూడుసార్లు ఏవో బూతులు మాట్లాడారు. ముందు ఆయనే లేచారు. నా మీద కొస్తుంటే నన్ను నేను కాపాడుకోవడానికి భయంతో లేచానే తప్పా, ఆయన మీద చేయి చేసుకోలేదు. పెద్దాయన మీద చేయిచేసుకునేంత సంస్కారం లేనివాడిని కాదు"అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇటీవ‌ల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ప్ర‌శంసించిన విష‌యాన్ని ప్ర‌స్తావించ‌గా తాను బీజేపీలో చేరుతానా? చేరనా అన్నది అప్రస్తుతమ‌ని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/