Begin typing your search above and press return to search.

అవును..సినిమా వాళ్ల‌కు చేత‌కాదు..మీరేం చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   21 March 2018 9:08 AM GMT
అవును..సినిమా వాళ్ల‌కు చేత‌కాదు..మీరేం చేస్తున్నారు?
X
తెగించినోడికి.. అన్న సామెత‌ను గుర్తు చేశారు సినీ న‌టుడు క‌మ్ మాట‌ల ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళి. సినిమా వాళ్ల‌ను ఏమ‌న్నా ప‌డి ఉంటార‌న్నది త‌ప్ప‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో తేల్చి చెప్పేశారాయ‌న‌. హోదాపై టీడీపీ నేత‌లు పోరాడుతున్న వేళ‌.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్ర‌సాద్ తెలుగు సినీ న‌టుల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఊహించ‌ని రీతిలో రియాక్ట్ అయ్యారు పోసాని.

ప్ర‌త్యేక హోదాపై తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు తెల‌ప‌టం లేద‌ని.. చంద్ర‌బాబు బ‌స్సులో ప‌డుకొని మ‌రీ ఏపీని అభివృద్ధి చేస్తున్నార‌ని.. టాలీవుడ్ వాళ్లు మాత్రం డ‌బ్బు మ‌త్తులో జోగుతున్న‌ట్లుగా చేసిన విమ‌ర్శ‌ల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

సినిమా వాళ్ల‌కు చేత‌కాద‌ని.. తాము ఏపీ రూంల్లో కూర్చొని కులుకుతామ‌ని టీడీపీ నేత‌లు అంటున్నార‌ని.. అవును త‌మ‌కు ఏదీ చేత‌కాద‌ని.. మ‌రి టీడీపీ నేత‌లు ఏం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. మాకు చేత‌కాద‌నే అనుకుందాం. మ‌రి మీరేం చేస్తున్నారు? అంటూ సూటిప్ర‌శ్న‌ను సంధించిన పోసాని.. విజ‌య‌వాడ‌లో దీక్ష‌కు వ‌చ్చిన సినిమా వాళ్ల‌ని లాఠీల‌తో కొట్టించింది మీరు కాదా? అని ఫైర్ అయ్యారు.

"ఒక్కొక్క‌రిని త‌రిమి త‌రిమి కొట్టిన సంగ‌తి మ‌ర్చిపోయారా? హోదా కోసం మాట్లాడిన వాళ్ల‌ను చెత్త‌వెధ‌వ‌ల‌ని మీరు నిన్న‌టి వ‌ర‌కూ అన్నారు. మ‌ళ్లీ మీరిప్పుడు స‌డ‌న్ గా హోదా కావాలంటే మేం మ‌ద్ద‌తు ఇవ్వాలా? అస‌లు హోదానే వ‌ద్ద‌ని చంద్ర‌బాబు చెబ‌తే మ‌న‌స్ఫూర్తిగా న‌మ్మాం. ఒక ముఖ్య‌మంత్రి చెప్పే మాట‌ల్లో నిజం ఉంటుంద‌ని అనుకున్నాం. మ‌ళ్లీ ఇప్పుడు మాట మారిస్తే ఎలా" అని ప్ర‌శ్నించారు.

హోదా కంటే ప్యాకేజీ ముద్దు అని ముఖ్య‌మంత్రే స్వ‌యంగా చెబితే అది నిజ‌మ‌ని న‌మ్మామ‌ని.. ఇప్పుడు మోడీతో చంద్ర‌బాబుకు ఏదో గొడ‌వ వ‌స్తే అదేదో ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌గా మాట్లాడ‌టం ఎంత‌వ‌ర‌కూ క‌రెక్ట్ అని నిల‌దీశారు. అప్పుడేమో ప్ర‌త్యేక ప్యాకేజీ.. ఇప్పుడేమో హోదా అని మాట్లాడుతున్నారు.. మాట త‌ప్పిన వాళ్ల‌ను లోఫ‌ర్ అనే క‌దా అంటారు.. ఎస్సీల్లో పుట్టాల‌ని కోరుకోరు క‌దా అని చంద్ర‌బాబు అంటే మేం జేజేలు కొట్టాలా? డ‌బ్బులిచ్చి ప‌క్క పార్టీ ఎమ్మెల్యేల్ని కొంటే సంతోషంగా మ‌ద్ద‌తు ప‌ల‌కాలా? అంటూ ఉతికి ఆరేశారు.

ఇన్ని మాట‌ల‌న్న పోసాని.. మ‌రో అడుగు ముందుకేసి... బ్రోక‌ర్ చంద్ర‌బాబు మాట‌ల్ని న‌మ్మి మేం పోరాటాలు చేయాలా? అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.ఇటీవ‌ల కాలంలో ఏపీ అధికార‌ప‌క్షంపై ఇంత తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన ప్ర‌ముఖులు పోసాని త‌ప్ప మ‌రెవ‌రూ లేర‌నే చెప్పాలి. టీడీపీ నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డ ఆయ‌న ..హోదా రావాలంటే ఒక్క‌టే దారంటూ.. కొత్త త‌ర‌హా మాట‌ను తెర‌పైకి తెచ్చారు.

పోరాటాలు ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు కొత్త‌కాద‌ని.. నాయ‌కులు నాడు జై ఆంధ్రా అన్నా.. నిన్న స‌మైక్యాంధ్రా అన్నా.. నేను ప్ర‌త్యేక‌హోదా అన్నా పిలుపు ఇచ్చిన‌ప్ర‌తిసారి జ‌నం స్పందిస్తూనే ఉన్నార‌న్నారు. అయితే.. అన్ని సంద‌ర్భాల్లోనూ పాల‌కులు జ‌నాల్ని మోసం చేశార‌న్నారు.

మొన్నీ మ‌ధ్య‌నే హోదా కోసం విజ‌య‌వాడ‌కు వ‌చ్చి ఆందోళ‌న చేసిన సినిమావాళ్ల‌ను పోలీసులు వీపులు ప‌గ‌ల‌కొట్టారు.. ఎందుకంటే అప్పుడు సీఎం చంద్ర‌బాబుకు కానీ టీడీపీకి కానీ హోదా అవ‌స‌రం లేద‌ని.. అప్పుడు హోదా కాదు ప్యాకేజీ మంచిదని చెబితే తామంతా కామ్ గా ఉండిపోయామ‌న్నారు.

ఇప్ప‌టికైనా హోదా రావాలంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అంతా విజ‌య‌వాడ న‌డిబొడ్డున నిరాహార‌దీక్ష‌కు దిగాలి. టాలీవుడ్ త‌ర‌ఫున నేను ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు కూర్చుంటాన‌న్నారు. హోదా కోసం తాను ప్రాణ‌త్యాగానికి సిద్ధ‌మ‌న్న పోసాని.. టీడీపీ నేతలు నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే మాత్రం స‌హించేది లేద‌ని తేల్చేశారు. తెలుగు త‌మ్ముళ్లు.. సినిమా వాళ్ల‌ను అనే ముందు పోసాని అక్క‌డ ఉంటార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకండి.