Begin typing your search above and press return to search.

ట్రంప్‌ పై సెటైర్లు వేసిన పోప్‌

By:  Tupaki Desk   |   25 May 2017 4:49 AM GMT
ట్రంప్‌ పై సెటైర్లు వేసిన పోప్‌
X
భిన్నమైన వ్య‌క్తిత్వం - త‌న‌దైన శైలిలో కామెంట్లు - వివాదాస్ప‌ద నిర్ణయాల‌తో దూకుడుగా వ్య‌వ‌హ‌రించే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఊహించ‌ని పంచ్‌ లు ఎదుర‌య్యాయి. అది కూడా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిమందిచే ఆరాధించ‌బ‌డే క్రైస్త‌వ మ‌త‌పెద్ద పోప్ వ‌ల్ల కావ‌డం ఆస‌క్తిక‌రం. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటన జరుపుతున్న డొనాల్డ్ ట్రంప్ వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని పెంపొందించడానికి అమెరికా అధ్యక్షుడిగా తన పలుకుబడిని ఉపయోగించాలని ట్రంప్‌ను కోరారు. తమ మధ్య అద్భుతమైన సమావేశం జరిగిందని ట్రంప్ అన్నారు. అంతేకాదు వాటికన్‌ కు రావడం, పోప్‌ ను కలుసుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ట్రంప్ అన్నారు.

అయితే పోప్ ఫ్రాన్సిస్‌ - ట్రంప్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ జ‌రిగిన‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డ‌తున్నాయి. త‌న‌తో స‌మావేశం సందర్భంగా పోప్ చూపు ట్రంప్ బరువుపై పడిందో ఏమో తెలియదు కానీ, మీ ఆయనకు ఆహారంగా ఏం పెడుతున్నావంటూ పక్కనే ఉన్న ట్రంప్ భార్య మెలానియాను సరదాగా అడిగారు. దీనికి ఆమె నవ్వేస్తూ ‘పోటికా’ అని సమాధానమిచ్చారు. పోటికా అనేది స్లోవేనియాలో నట్స్‌ తో చేసిన ఒక కేక్. మెలానియా జన్మస్థలం స్లోవేనియా కావడం గమనార్హం. ఈ చ‌ర్చ సంద‌ర్భంగా ట్రంప్ ముసిముసిన‌వ్వులు చిందించారు. అనంత‌రం పోప్ ప్రాన్సిస్ శాంతికి చిహ్నమైన ఆలివ్ ట్రీ చెక్కిన ఒక పతకాన్ని ట్రంప్‌ కు బహూకరించారు. ‘మీరు శాంతికి కారణమవుతారన్న ఉద్దేశంతో నేను మీకు దీన్ని ఇస్తున్నాను’ అని పోప్ ఈ సందర్భంగా స్పానిష్ భాషలో ట్రంప్‌ తో అన్నారు. మీరన్న మాటలను గుర్తుంచుకుంటానని ట్రంప్ అన్నారు. నిజానికి పోప్ ఫ్రాన్సిస్ అనేక విషయాల్లో ట్రంప్ విధానాలతో తీవ్రంగా విభేదిస్తుండడం తెలిసిందే. ముఖ్యంగా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మిస్తామన్న ట్రంప్ ప్రకటనపై ఫ్రాన్సిస్ తీవ్రంగా స్పందించడం తెలిసిందే. అలాగే పర్యావరణం, గర్భస్రావాలు లాంటి అనేక విషయాల్లో సైతం ఫ్రాన్సిస్, ట్రంప్ అభిప్రాయాలు పూర్తి భిన్నంగా ఉండడం అందరికీ తెలిసిందే. కాగా, పోప్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ వెంట ఆయన భార్య, కుమార్తె ఇవాంకా, అల్లుడు, ఆయన బృందంలోని ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు.

కాగా, తన తొలి పర్యటనలో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రాంతాలను సందర్శించిన ట్రంప్ ఏకకాలంలో యూదులు, క్రైస్తవ, ముస్లిం మతాలకు చెందిన పవిత్ర స్థలాలను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్‌ ఆర్ మెక్‌ మాస్టర్ అభివర్ణించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/