Begin typing your search above and press return to search.

నాడు సీఎంని కాల్చిపడేస్తామని వార్నింగ్ ఇచ్చారట

By:  Tupaki Desk   |   26 Sep 2016 8:23 AM GMT
నాడు సీఎంని కాల్చిపడేస్తామని వార్నింగ్ ఇచ్చారట
X
విభజన జరిగి రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు కొన్ని ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. తెలంగాణ సాధన విషయంలో ఇప్పటివరకూ ప్రచారానికి రాని చాలానే అంశాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఏపీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన 'విభజన కథ' పేరిట పుస్తకంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డిపై కొన్ని ఆరోపణలు చేయటం తెలిసిందే. దీనిపై స్పందించిన జైపాల్.. ఉండవల్లిపై విమర్శలు చేయటంతో వాతావరణం వేడెక్కింది. ఇదిలా ఉంటే.. ఈ అంశాన్ని డిబేట్ రూపంలో మార్చిన ఒక ప్రైవేటు ఛానల్.. జైపాల్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఉండవల్లిని తెర మీదకు తీసుకొచ్చి వారి మధ్యన సంవాదం మొదలెట్టింది.

ఈ చర్చలో మరో తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను కూడా తీసుకొచ్చింది. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. మిగిలిన అంశాలన్నీ ఒక ఎత్తు అయితే.. తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఎంపీలు ఎంత దూకుడుగా వ్యవహరించారన్న విషయాన్ని పొన్నం ప్రభాకర్ చెప్పకనే చెప్పేశారు. తెలంగాణ కేసీఆర్ ఒక్కడే తీసుకురాలేదని.. సీనియర్ నేత జైపాల్ తో పాటు తాను.. కాంగ్రెస్ ఎంపీలు ఎంతో కష్టపడినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా కాస్తంత ఆవేశానికి గురైన పొన్నం.. నాడు జరిగిన విషయాల్ని చెప్పుకొస్తూ.. తెలంగాణకు అడ్డు పడితే తమ పార్టీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కాల్చి పారేస్తామని హెచ్చరించినట్లుగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తమకున్న స్వేచ్ఛ అంత అని వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంత దూకుడుగా వ్యవహరించారు? తెలంగాణ సాధన కోసం ఎంతవరకు వెళ్లారన్న విషయాన్ని పొన్నం చెప్పకనే చెప్పేశారు. మరి.. అలాంటి విషయాల్ని ఇంతకాలం ఎందుకు దాచినట్లు..? ఇప్పుడే ఎందుకు చెబుతున్నట్లు? అన్నవి ఇప్పుడు తలెత్తే ప్రశ్నలు.