Begin typing your search above and press return to search.

కేసీఆర్ గుట్టు విప్పిన పొన్నం

By:  Tupaki Desk   |   5 May 2016 5:49 AM GMT
కేసీఆర్ గుట్టు విప్పిన పొన్నం
X
రోజులన్నీ ఒకేలా ఉండవు. ఉద్యమ సమయంలో ఉండే పరిస్థితులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఉండవన్న విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుండొచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము చేసిన వాదనకు ఎదురులేకుండా ఆయన భావోద్వేగాన్ని ఒక అస్త్రంగా ప్రయోగించేవారు. ఉద్యమ స్ఫూర్తిని దెబ్బ తీసినట్లు అవుతుందన్న ఆలోచనలో రాజకీయ పార్టీలన్నీ కూడా టీఆర్ ఎస్ చేసే వాదనకు చెక్ పెట్టేందుకు సందేహించేవి. ఒకట్రెండు తప్పులు చేసినా.. చూసీచూడనట్లుగా వ్యవహరించి.. టీఆర్ ఎస్ కు అండ అన్నట్లుగా వ్యవహరించేవి. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు.

తెలంగాణ సర్కారు షురూ చేసిన ప్రాజెక్టుల మీద ఏపీ సర్కారు.. ఏపీ విపక్ష నేత మాత్రమే కాదు.. తెలంగాణ రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా షురూ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్నే తీసుకుంటే.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతో ముఖ్యమైన మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు ఇప్పటివరకూ ఒప్పందం చేసుకోలేదన్న అసలు విషయాన్ని బయటపెట్టారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్. ప్రాజెక్టుల పేరిట తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారంటూ ఆయన మండిపడుతున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ గురించి పొన్నం ఎంతగా చెలరేగిపోయారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సీమాంధ్ర ప్రజల మీద ఒంటి కాలి మీద విరుచుకుపడేవారు. విభజన బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టిన సందర్భంగా లగడపాటి పెప్పర్ స్ర్పే ఉదంతంలోనూ పొన్నం బాధితుడన్న విషయం మర్చిపోకూడదు. ఇదే ఉదంతంపై లగడపాటి వెర్షన్ వేరుగా ఉండటం వేరే సంగతి. ఇక్కడ చెప్పేదేమంటే.. తెలంగాణ ప్రయోజనాల గురించి ఇంచ్ కూడా వెనక్కి తగ్గని పొన్నం ప్రభాకర్ లాంటివాళ్లు సైతం ఈ రోజు తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న ప్రాజెక్టులు చేపడుతున్న తీరును తప్పు పట్టటం గమనార్హం.

ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన పనులు సగం పూర్తి అయ్యయని..ప్రాజెక్టుల రీ డిజైన్ పేరిట కేసీఆర్ తన పేరు నిలుపుకోవాలని.. తన విగ్రహాలు పెట్టుకోవాలన్న దుష్టబుద్ధితో రీడిజైన్ చేయటం కనిపిస్తోందని పొన్నం మండిపడుతున్నారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జోరుగా చేస్తున్న తెలంగాణ సర్కారు.. వాటికి సంబంధించిన అనుమతులు.. ఒప్పందాల విషయంలో కూడా అంతే జోరుగా వ్యవహరించాలన్న సూచన వినిపిస్తోంది. మరి.. ఈ విషయాన్ని కేసీఆర్ అండ్ కో పట్టించుకుంటారా?