Begin typing your search above and press return to search.

పొంగులేటి గ్రాఫ్ ను చండీయాగం మారుస్తుందా?

By:  Tupaki Desk   |   13 Oct 2019 2:37 PM GMT
పొంగులేటి గ్రాఫ్ ను చండీయాగం మారుస్తుందా?
X
తెలంగాణలో మరో చండీయాగం మొదలైపోయింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణాపురం పరిధిలోని ఓ మామిడి తోటలో ఆదివారం ప్రారంభమైన ఈ యాగాన్ని మొదలెట్టింది ఎవరన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. బిజినెస్ లో తనదైన శైలి విజయాలు నమోదు చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి... తొలి దఫాలోనే ఎంపీగా విజయం సాధించి సత్తా చాటిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారట. తన మామిడి తోటలోనే యాగశాలను నిర్మించిన పొంగులేటి రుత్విక్కులతో యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారట. ఆదివారం మొదలైన ఈ యీగం.. నిర్విఘ్నంగా ఐదు రోజుల పాటు కొనసాగనుందట. అంతేకాదండోయ్... ఈ యాగానికి రావాలంటూ ఆయన ఏకంగా సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించారట. 9 మంది పీఠాధిపతుల పర్యవేక్షణలో 200 మంది రుత్వికులు పాల్గొంటున్న ఈ యాగానికి చినజీయర్‌స్వామి, విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, ధర్మపురి సచ్చిదానంద ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామి తదితరులు హాజరై ప్రవచనాలు వినిపిస్తారట.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి... వైఎస్ ఫ్యామిలీకి వీరాభిమాని కిందే లెక్క. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుండగానే రాజకీయాల్లోకి వచ్చేసిన పొంగులేటి... వైఎస్ అకాల మరణం, ఆ తర్వాత వైఎస్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతంగా వైసీపీ పేరిట పార్టీ పెట్టడంతో... పొంగులేటి కూడా వైసీపీలో చేరిపోయారు. అంతేనా... తెలుగు నేల రెండుగా విభజన జరిగిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై పార్టీ ఘోరంగా చతికిలబడ్డా... ఖమ్మం పార్లమెంటు నుంచి పొంగులేటి ఎంపీగా సత్తా చాటారు. తన జిల్లాలో మరో మూడు ఎమ్మెల్యే సీట్లను కూడా పార్టీకి దక్కేలా కృషి చేశారు. అయితే ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోగా... వైసీపీని వీడిన పొంగులేటి తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరిపోయారు.

టీఆర్ఎస్ లో చేరిన తొలినాళ్లలో ఓ మోస్తరుగా హెుషారుగా కనిపించిన పొంగులేటి ఆ తర్వాత క్రమంగా తెర వెనుకకు వెళ్లిపోయారు. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే... కాంట్రాక్టర్ గా, వ్యాపారవేత్తగా తనదైన శైలి విజయాలను నమోదు చేసిన పొంగులేటికి రాజకీయాలు మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. మరి బిజినెస్ లో సక్సెస్ ఫుల్ కెరీర్ మాదిరే... పాలిటిక్స్ లోనూ కెరీర్ బాగుండాలంటే ఏం చేయాలి? ఇంకేం చేయాలి? చండీయాగం చేయాలి. తెలంగాణలో ఇప్పుడంతా ఇదే భావన వ్యక్తమవుతోంది. స్వయంగా సీఎం హోదాలో ఉన్న కేసీఆరే నిత్యం యాగాలంటూ చేసుకుంటూ పోతుంటే.. మిగిలిన వారు కూడా అదే బాట పడతారు కదా. ఇప్పుడు పొంగులేటి కూడా కేసీఆర్ బాటనే ఆశ్రయించి చండీయాగానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ యాగంతో పొంగులేటి పొలిటికల్ గ్రాఫ్ ఏ మేరకు మారుతుందో చూడాలి.