Begin typing your search above and press return to search.

తెలంగాణ కాంగ్రెస్ కు పొంగులేటి షాక్

By:  Tupaki Desk   |   2 May 2016 5:30 PM GMT
తెలంగాణ కాంగ్రెస్ కు పొంగులేటి షాక్
X
ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిన చందంగా మారింది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. జగన్ ను దెబ్బ తీయటానికి ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని కారు ఎక్కించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ అధికారపక్ష అధినేత తీసుకోవటం.. అందుకు తగ్గట్లుగా పావులు కదపటంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో అక్కడి రాజకీయం ఇప్పటికే హీటెక్కిపోగా.. తాజా పరిణామాలు జిల్లా రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారాయి.

ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షానికి షాకిచ్చే పనిలో భాగంగా విపక్షాలన్ని కలిసేలా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదిపింది. అందరి నుంచి ఓకే మాట చెప్పించుకున్న తర్వాత అన్ని పార్టీల అధినేతలతో కలిపి వినూత్నరీతిలో ప్రచారం చేయటం షురూ చేసింది. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో పాటు.. ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు.. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పొంగులేని శ్రీనివాసరెడ్డి ఫోటోల్ని కూడా అచ్చేసి విస్తృతంగా ప్రచారం చేసింది.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవటంతో ఒక్కసారిగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రచారాల్లో.. ఫ్లెక్సీల్లో కనిపించిన పొంగులేని ఇప్పుడు ప్రత్యర్థి టీఆర్ ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిగా మారటం.. రేపటి నుంచి పాలేరు ఉప ఎన్నికల ప్రచార బరిలో దిగనుండటం తెలంగాణ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారనుంది. చూస్తుంటే.. పొంగులేటి జగన్ కు మాత్రమే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్ ఇచ్చినట్లేనని చెప్పక తప్పదు.