Begin typing your search above and press return to search.

దేశ వ్యాప్తంగా..స్వల్పంగా పెరిగిన పోలింగ్ శాతం!

By:  Tupaki Desk   |   24 April 2019 3:05 PM GMT
దేశ వ్యాప్తంగా..స్వల్పంగా పెరిగిన పోలింగ్ శాతం!
X
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి దశలోనూ దాదాపుగా స్వల్పంగా పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోందని కేంద్ర ఎన్నికల కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి. తొలి దశలో ఏపీతో పాటు జరిగిన వివిధ రాష్ట్రాల పోలింగ్ లో ఒక శాతం వరకూ పెంపుదల నమోదు అయ్యింది. రెండో దశలో తొలి దశతో పోలిస్తే పోలింగ్ శాతం నమోదైంది తక్కువే కానీ.. గతంతో పోలిస్తే స్వల్పంగా అధికంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదు అయ్యింది.

ఇక మూడో దశ పోలింగ్ విషయంలోనూ అలాంటి గణాంకాలే చెబుతోంది ఎన్నికల కమిషన్. మూడో దశలో మొత్తంగా 67.95 శాతం పోలింగ్ నమోదు అయినట్టుగా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మంగళవారం రోజున నూటా పదహారు ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. వాటిల్లో కేరళ - కర్ణాటక - మహారాష్ట్ర - యూపీ వంటి రాష్ట్రాల్లోని కీలకమైన సీట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ నమోద శాతం స్వల్పంగా పెరిగిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

కేరళ అయితే 77.67 శాతంతో కొత్త చరిత్రను సృష్టించిందట. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో అక్కడ పోలింగ్ నమోదు అయినట్టుగా ఎన్నికల కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి.

అలాగే అస్సోంలో కూడా రికార్డు స్థాయి పోలింగ్ నమోదు అయ్యింది. అక్కడ ఈ స్థాయి పోలింగ్ నమోదు కావడం ఇదే మొదటి సారి అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అస్సోంలో నమోదైన పోలింగ్ శాతం 84.88. ఇలా దేశ వ్యాప్తంగా పోలింగ్ పర్సెంటేజ్ లో పెరుగుదల కనిపిస్తూ ఉంది.

ఇదంతా ఓటర్లలో పెరిగిన చైతన్యానికి ప్రతీక అనుకోవాలో లేక మరేదైనా కారణం ఉందో ముందు ముందు తెలుస్తుంది. అయితే పోలింగ్ పర్సెంటేజ్ లో జమ్మూ కాశ్మీర్ మాత్రం వెనుక బడిపోయింది. ఈ సారి ఆ రాష్ట్రంలో అత్యల్ప స్థాయి పోలింగ్ శాతాలు నమోదు అయ్యాయి.

రెండో దశ పోలింగ్ జరిగినప్పుడు కనీసం పద్నాలుగు శాతం చిల్లర పోలింగ్ అయినా నమోదు కాగా, మూడో దశలో పోలింగ్ జరిగిన జమ్మూ కశ్మీర్ ఎంపీ సీట్లలో కేవలం పన్నెండు శాతం స్థాయిల పోలింగ్ మాత్రమే నమోదు అయ్యింది.