దెందులూరు.. పోలింగ్ పర్సెంటేజ్ దేనికి సంకేతం?

Thu Apr 25 2019 19:00:02 GMT+0530 (IST)

ఈ సారి ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో నమోదు అయిన సగటు పోలింగ్ కన్నా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ శాతం (84.70) ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ నియోజకవర్గం అసలే ప్రత్యేకం. దానికి కారణం అక్కడ చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉండటం. తన తీరుతో అనేక వివాదాలను రేపిన చింతమనేని అక్కడ ఎమ్మెల్యేగా ఉండటంతో ఈ నియోజకవర్గం ఫలితం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇక్కడ ఏం జరుగుతుందనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న అంశం. ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ కమ్మ కులస్తుడు  అయిన అభ్యర్థినే బరిలోకి దించింది. ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచినే కొఠారు అబ్బయ్య చౌదరిని ఇక్కడ ఇన్ చార్జిగా పెట్టి - చివరకు టికెట్ కూడా ఆయనకే కేటాయించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఎన్నికల ముందు అక్కడ చాలా జరిగాయి. అక్కడ ఏం జరిగినా అంతా చింతమనేని ప్రభాకర్ కేంద్రంగానే జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్లస్  పాయింట్ చింతమనేని - తెలుగుదేశానికి మైనస్ పాయింట్ కూడా ఆయనే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచార అస్త్రం కూడా చింతమనేని ప్రభాకర్ వైఖరే.

తహశీల్దార్ వనజాక్షి వ్యవహారం అయితేనేం - బస్సుపై చంద్రబాబు బొమ్మ చిరిగిందని కండక్టర్ పై విరుచుకుపడటం అయితేనేం - దళితులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలు అయితేనేం.. పెద్ద దుమారాన్నే రేపాయి. వేరే ఎవరైనా ఇలా మాట్లాడితే వారికి అదే చివరి టర్మ్ అయ్యేది. మళ్లీ టికెట్ కూడా దక్కేది కాదు. అయితే చింతమనేనికి సొంతంగా క్యాడర్ ఉంది నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ ఉంది. అందుకే మరో ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ ఖరారు చేశారు. చింతమనేని వైఖరి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి నష్టం జరుగుతుందనే విశ్లేషణలు ఉన్నా ఆయన విషయంలో బాబు మొహమాట పడలేదు.

ఇలాంటి పరిణామాల మధ్యన పోలింగ్ శాతం అధికంగా నమోదు కావడం అనేది ఆసక్తిదాయకమైన అంశంగా కనిపిస్తోంది. ఇదంతా చింతమనేనిపై జనాల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం అనే విశ్లేషణలకు అవకాశం ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగటు పోలింగ్ శాతం కన్నా దెందులూరులో అధికంగా ఉండటంతో వైస్సార్సీపీ తమదే విజయం అనే ధీమాను వ్యక్తం చేస్తోంది.

అయితే అది నిజంగా నిజమేనా..అంటే ఇప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. గత ఎన్నికల్లో చింతమనేనికి పదిహేడు వేల ఓట్ల చిల్లర భారీ మెజారిటీ దక్కింది. దాన్ని దాటేసి ప్రత్యర్థి విజయబావుట ఎగరేయడం అంటే మాటలేమీ కాదు. మరి అసలు  ఏమిటంటే.. మే ఇరవై మూడున తేలే అంశం అదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.