Begin typing your search above and press return to search.

ఏపీలో కౌంటింగ్ అర్థ‌రాత్రి దాట‌టం ఖాయ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   17 May 2019 6:01 AM GMT
ఏపీలో కౌంటింగ్ అర్థ‌రాత్రి దాట‌టం ఖాయ‌మ‌ట‌!
X
సుదీర్ఘంగా సాగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు కీల‌క ఘ‌ట్టానికి వ‌చ్చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఆరు ద‌శ‌ల పోలింగ్ పూర్తి అయి.. ఏడో ద‌శ‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. పోలింగ్ పూర్తి అయ్యాక‌.. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 23న ఓట్ల లెక్కింపున‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏప్రిల్ 11న జ‌రిగిన పోలింగ్ లో ఓట‌ర్లు త‌మ తీర్పును ఈవీఎంల‌లో నిక్షిప్తం చేసిన సంగ‌తి తెలిసిందే. వారి తీర్పును లెక్కించేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. బ్యాలెట్ పేప‌ర్ స్థానే.. ఈవీఎంలు ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఓట్ల లెక్కింపు కార్య‌క్ర‌మం చాలా వేగంగా పూర్తి అవుతున్న విష‌యం తెలిసిందే. ఉద‌యం మొద‌ల‌య్యే ఓట్ల లెక్కింపు ఉద‌యం ప‌ద‌కొండు గంట‌లు అయ్యేస‌రికి విజేత ఎవ‌ర‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేది. తుది ఫ‌లితాలు సైతం మ‌ధ్యాహ్నానానికి పూర్తి అయ్యేవి. కొన్నిచోట్ల మాత్రంసాయంత్రం వ‌ర‌కు సాగేవి.

ఇదిలా ఉంటే.. ఈసారి ఎన్నిక‌ల సంఘం అమ‌లు చేస్తున్న కొత్త విధానం కార‌ణంగా ఎన్నిక‌ల ఫ‌లిత‌ల వెల్ల‌డి ఆల‌స్యం కావ‌ట‌మే కాదు.. కౌంటింగ్ సైతం అర్థ‌రాత్రి వ‌ర‌కూ స‌మ‌యం తీసుకుంటుద‌ని చెబుతున్నారు. 23 ఉద‌యం మొద‌ల‌య్యే ఓట్ల లెక్కింపు.. అర్థ‌రాత్రి దాటే వ‌ర‌కూ సాగ‌టం ఖాయ‌మంటున్నారు. ఎందుకిలా అంటే.. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు.. వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించాల్సి ఉంటుంది. ఈ రెండింటి మ‌ధ్య ఎలాంటి వ్య‌త్యాసం లేకుండా ఓకే. ఒక‌వేళ తేడా వ‌స్తే మాత్రం ఫ‌లితాల వెల్ల‌డి మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

ఉద‌యం 6 గంట‌ల‌కు కౌంటింగ్ లో పాల్గొనే వారంతా కౌంటింగ్ సెంట‌ర్ల‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. ఉద‌యం స‌రిగ్గా 7.30 గంట‌ల వేళ‌లో అభ్య‌ర్థి.. అబ్జ‌ర్వ‌ర్ల స‌మ‌క్షంలో ఈవీఎంల‌ను భ‌ద్ర‌ప‌ర్చిన స్ట్రాంగ్ రూమ్ ను తెరుస్తారు. 8.15 గంట‌ల‌కు ఈవీఎంలు కౌంటింగ్ టేబుళ్ల మీద‌కు వ‌స్తాయి. తొలుత పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓపెన్ చేసి లెక్కిస్తారు. స‌రిగ్గా 8.30 గంట‌ల‌కు ఈవీఎంల‌ను ఓపెన్ చేస్తారు. అలా మొద‌లైన ఓట్ల లెక్కింపు మ‌ధ్య‌లో ఎలాంటి బ్రేక్ లు ఇవ్వ‌రు. లంచ్ మ‌ధ్య‌లో చేసే వీలున్నా.. కౌంటింగ్ ను మాత్రం ఆప‌రు. తాజాగా మార్చిన నిబంధ‌న‌ల నేప‌థ్యంలో అర్థ‌రాత్రి దాటే వ‌ర‌కూ కౌంటింగ్ సాగుతుంద‌ని.. ఆ త‌ర్వాత మాత్ర‌మే లెక్క‌లు స్ప‌ష్టంగా వెల్ల‌డి కానున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ సాయంత్రానికి పూర్తి అయ్యే కౌంటింగ్ ప్ర‌క్రియ‌.. ప‌క్క‌రోజు వ‌ర‌కూ సాగ‌టం ఈమ‌ధ్య కాలంలో ఇదే తొలిసారి అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.