పొలిటికల్ హీట్ నుంచి నేతల ఉపశమనం..విదేశీ టూర్లు!

Fri Apr 12 2019 21:40:43 GMT+0530 (IST)

ఇన్ని రోజులూ మండుటెండలను లెక్క చేయగా.. గట్టిగా కష్టపడిన రాజకీయ నేతలు ఇప్పుడు రిలాక్సేషన్ మూడ్ లోకి వెళ్లిపోతున్నారు. నిన్న పోలింగ్ ముగియడంతోనే పని దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక చేయగలిగింది కేవలం ఫలితాల కోసం వేచి ఉండటమే. అందునా ఈ సారి ఏపీ - తెలంగాణ ఎన్నికల ఫలితాలు తొందరగా ఏమీ రావు. మే నెల ఇరవై మూడో తేదీ వరకూ ఫలితాల వెల్లడి ఉండదు.ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు రిలాక్స్డ్ గా విదేశీ పర్యటనలు పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న వివరాల ప్రకారం.. నేతల విదేశీ పర్యటనల వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డిటాక్స్ సెషన్స్ కు అటెంట్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా జగన్ అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వచ్చారు. పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి జగన్ గాలికి - ధూళికి - ఎండకూ  - వానకూ తిరిగారు. ఇక ఎన్నికల ప్రచార పర్వంలో విపరీతమైన ఎండలో జగన్ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో జగన్ మొహమే మారిపోయిన సంగతిని అంతా గమనించే ఉంటారు.

మొహమంతా నల్లగా మారిపోయింది. ఈ నేపథ్యంలో జగన్ ఆ డార్క్ నెస్ ను వదిలించుకోవడంపై కొంత కాన్సన్ ట్రేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తన కుటుంబం కూతుర్లతో కలిసి గడిపేందుకు జగన్ లండన్ వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక ఇప్పటికే కుటుంబంతో కలిసి రిసార్ట్ కు చేరిపోయాడట బాలకృష్ణ. భార్య కొడుకుతో సహా కూతుర్లు - అల్లుళ్లను తీసుకుని బాలకృష్ణ రిసార్ట్ లో కూల్ అవుతున్నట్టుగా సమాచారం.

ఇక కాంగ్రెస్ నేత - ఆ పార్టీ తరఫున చేవేళ్ల నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి తన కోసం యోగా సెషన్స్ ను ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

తెరాస నేత కవిత తన పిల్లలతో కలిసి విదేశీ విహారానికి వెళ్లినట్టుగా సమాచారం.కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి కూడా విదేశీ విహారాన్నే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల ప్రచారంలో దుమ్మకూ ధూళికి - ఉక్కపోత - ఎండలో గడిపిన నేతలు ఇప్పుడు కూల్ అవుతున్నట్టుగా ఉన్నారు.