తెలంగాణలో పొలిటికల్ బీటు రిపోర్టర్లకు కష్టకాలం?

Sat Feb 09 2019 11:54:15 GMT+0530 (IST)

మీడియా అన్నంతనే.. దాని యజమాని.. అందులో పని చేసే ముఖ్యులే తప్పించి.. ఒక మీడియా సంస్థ నిర్వహణ ఎలా ఉంటుంది? అన్న విషయం మీద చాలామందికి క్లారిటీ ఉండదు. బయట ప్రపంచం చూసే వార్తల వెనుక ఎంత కసరత్తు.. ఎంతమంది మైండ్ ప్లానింగ్ ఉంటుందన్న విషయాలు పెద్దగా బయటకు రావని చెప్పాలి. అదే సమయంలో ప్రింట్.. ఎలక్ట్రానిక్.. వెబ్ మీడియాలలో వార్తలు ఎలా జెనరేట్ అవుతాయన్న దానిపై అవగాహన తక్కువగా ఉంటుంది.నిజానికి బయట వారికే కాదు.. మీడియాలో సుదీర్ఘకాలం పని చేసిన వారికి సైతం.. ఏ ఫ్లాట్ ఫాం మీద ఎలా వార్తలు వస్తాయన్న స్పష్టత అస్సలు ఉండదు. ఇదంతా ఎందుకంటే.. ప్రింట్ మీడియాకు చెందిన పొలిటికల్ రిపోర్టర్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.

కొన్ని మీడియా సంస్థల్లో జనరల్ బ్యూరో.. పొలిటికల్ బ్యూరో అనే రెండు విబాగాలు ఉంటాయి. కొన్ని సంస్థల్లో రెండు కలిసి ఉంటాయి. మరికొన్నింట్లో మాత్రం వేర్వేరుగా ఉంటాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే. .సీఎం పేషీ చూసే రిపోర్టర్లు.. ఆ విభాగపు చీఫ్ లకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. కేసీఆర్ కేబినెట్ విస్తరణకు సంబంధించిన వివరాల్ని ఎప్పటికిప్పుడు అప్డేట్ చేసేలా వార్తల్ని ఇచ్చే విషయం మహా ఇబ్బందిగా మారినట్లు చెప్పక తప్పదు.

గతంలో మాదిరి సమాచారం బయటకు రాని పరిస్థితి. అదే సమయంలో.. ప్రభుత్వ పరంగా స్తబ్దుగా ఉండటం.. యాక్టివిటీ బయటకు రాకపోవటంతో సమాచారం అందని పరిస్థితి. నిర్ణయాలన్నిసమిష్టిగా తీసుకుంటే లీకులు ఉంటాయి. కానీ.. అందుకు భిన్నంగా తానేం చేయాలన్నది తాను మాత్రమే డిసైడ్ చేసే కేసీఆర్ లాంటి అధినేత ఉన్నప్పుడు సమాచారం బయటకు రావటం సాధ్యమే కాదు.

ఇటీవల కాలంలో ఎవరినీ నమ్మనట్లుగా.. ఏ సమాచారాన్ని వెల్లడించని ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుతో.. ఆయన మనసులో ఏముందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అదే సమయంలో.. అంచనాలు చెప్పేందుకు సీనియర్ నేతలు సైతం పెదవి విప్పని పరిస్థితి తెలంగాణలో ఉంది. దీంతో.. ఈ కార్యకలాపాల్ని వార్తలుగా అందించాల్సిన బీటు రిపోర్టర్ కు ఇప్పుడు కొత్త ఇబ్బంది ఎదురవుతోంది. సాయంత్రం అయ్యేసరికి ఆఫీసుకు వెళ్లిన వారికి..ఏం జరిగిందన్న ప్రశ్న.. దానికి కొత్తగా ఏమీ లేదన్న మాట రోటీన్ గా మారటం.. అదే టైంలో ఎవరినైనా ఊహించిన వార్తలు రాస్తే.. దానికి వివరణ ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి. దీంతో.. సుదీర్ఘకాలంగా సీఎం బీటు చూస్తున్న సీనియర్ రిపోర్టర్లకు.. ఆ విభాగాల అధిపతులకు చుక్కలు కనిపిస్తున్నాయట.   తన తీరుతో సొంత పార్టీ నేతలకే కాదు.. మీడియా ప్రతినిధులకు చెమటలు పట్టిస్తున్న క్రెడిట్ కేసీఆర్ కే దక్కుతుందని చెప్పక తప్పదు.