Begin typing your search above and press return to search.

తెలంగాణ స్పెష‌ల్ః రైతుల చుట్టూ రాజ‌కీయాలు

By:  Tupaki Desk   |   9 Oct 2017 7:43 AM GMT
తెలంగాణ స్పెష‌ల్ః రైతుల చుట్టూ రాజ‌కీయాలు
X
రాజ‌కీయాల్లో ఒక‌టి రెండు శాతం ఓట్లున్న వారి కోస‌మే నానా తంటాలు ప‌డుతూ...వారిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు అప‌సోపాలు ప‌డుతున్న ప్ర‌స్తుత కాలంలో గంప‌గుత్తగా 70 శాత ఓటు బ్యాంకు ఉంటే అటు అధికార పార్టీ ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీ అయినా అలాంటి ఓట్ల‌ను వ‌దలుకుంటుందా చెప్పండి? చాన్సే లేదంటారా? నిజ‌మే. చాన్సే లేదు. అందుకే తెలంగాణ‌ రాష్ట్రంలో అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న రైతులపై ఇటు అధికార పార్టీ - అటు విపక్షాలు కన్నేశాయి. రాష్ట్రంలో 70శాతం మంది రైతులే కాబ‌ట్టి ఇటీవల రాజకీయాలన్నీ రైతు చుట్టే తిరుగుతున్నాయి. 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం కొత్త పథకాలకు శ్రీకారం చుట్టగా - ప్రతిపక్షాలు అందులోని లొసుగులను వెతుకుతూ ధర్నాలు - రాస్తారోకోల ద్వారా నిరసనలు తెలుపుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో ఎజెండాతో రైతులను ఆకర్శించడానికి తంటాలు పడుతున్నాయి. ఇలా అధికార - విపక్షాల మధ్య పెరిగిన పోటీతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వేడి రగులుకుంది.

2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం పలు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. రైతులను ఆకట్టుకునేందుకు ఇంటికో బర్రె - వ్యవసాయ పెట్టుబడి గొల్ల కురుమలకు 75శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లు ఇచ్చిన ప్రభుత్వం వ్యవసాయం - దాని అనుబంధ పరిశ్రమలపై ఆధార పడిన రైతులను ఆకట్టుకునేందుకు కొత్త పథకాలను ప్రకటించింది. మదర్‌ డెయిరీలో సభ్యత్వం కలిగిన ప్రతి రైతు కుటుంబానికి 50శాతం సబ్సిడీపై పాడి గేదెను - రానున్న సంవత్సరం నుంచి వ్యవసాయ పెట్టుబడిగా ఎకరాకు రూ. 4 వేల చొప్పున సంవత్సరానికి రెండు పంటలకు రూ. 8వేలు ఉచితంగా ఇస్తామని టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు వ్యవసాయ పెట్టుబడిగా ఇచ్చే డబ్బు రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో ఇచ్చినట్టుగా ఉండేందుకు ఇటీవల రెవెన్యూ గ్రామానికి 15 మంది సభ్యులతో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. సాగయ్యే భూమికి పెట్టుబడి అందించేందుకు గాను రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు పూనుకుంది. త్వరలోనే సబ్సిడీపై పాడిగేదెలు అందించేందుకు కసరత్తు చేస్తోంది.

అయితే ప్రతిపక్షాలు అధికార పార్టీ కార్య‌క్ర‌మాల‌లోని లొసుగులను వెతుకుతూ ధర్నాలు - రాస్తారోకోల ద్వారా నిరసనలు మొద‌లుపెట్టాయి. రైతు సమన్వయ సమితుల్లో మొత్తం టీఆర్‌ ఎస్‌ నాయకులు - కార్యకర్తలనే ఎంపిక చేయడంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ పలుచోట్ల ధర్నాలు - రాస్తారోకోలు నిర్వహించారు. పోటీ కమిటీలు కూడా వేస్తామని ప్రకటించారు. రైతులను చైతన్య పర్చేందుకు ఇందిరమ్మ రైతుబాట పేరిట జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఇందిరమ్మ రైతు సదస్సులు నిర్వహించడంతో పాటు నిరసన కార్యక్రమాలు సైతం చేపట్టారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కమిటీలను కూడా వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బూత్‌ కమిటీ సభ్యుల పేర్లు - వారి సెల్‌ నంబర్లను ఒక యాప్‌ లో పొందుపర్చి కేంద్ర స్థాయి నాయకుడి నుంచి గ్రామస్థాయి నాయకుడికి అనుబంధం ఏర్పడేలా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు టీడీపీ - బీజేపీ - వామపక్షాలు కూడా రైతు జపంతోనే రాజకీయ ప్రసంగాలు మొదలు పెడుతున్నారు. పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో స‌ర్కారు వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నికలు కూడా ఈ రైతు ఎజెండాతోనే ఉన్నాయనే సంకేతాలు ఉండడంతో అన్నీ పార్టీలు రైతులను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. బీజేపీ కూడా గ్రామ స్థాయి నుంచి బూత్‌ స్థాయి - వార్డుల్లో కమిటీలు వేస్తూ పార్టీని బలోపేతం చేస్తోంది. ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు పాలనలోని లోపాలపై ప్రతిపక్షాలన్నీ ధ్వజమొత్తుతుండగా అధికార పార్టీ మాత్రం చేసిన అభివృద్ధితో చేయబోయే పనులను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. మొత్తంగా 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. అందుకు అండ‌గా అన్న‌దాత‌ను అండ‌గా చేసుకుంటున్నాయి.