Begin typing your search above and press return to search.

ఓటర్ పల్స్ పై లెక్కలేస్తున్న నేతలు..

By:  Tupaki Desk   |   12 April 2019 6:36 AM GMT
ఓటర్ పల్స్ పై లెక్కలేస్తున్న నేతలు..
X
మైకుల మోతలు.. నేతల ప్రచారాలు.. హామీలు.. విమర్శలతో నెలన్నర హోరు సాగించిన ఎన్నికల ప్రక్రియలో ఒక ఘట్టం ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు సాగిన పోలింగ్‌ లో ఏపీలో మొత్తానికి ఓటర్లు తమ నిర్ణయాన్ని ప్రకటించేశారు. ఇక ఈవీఎంలు అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నాయి. అయితే ఫలితాలు నెలన్నర పాటు గడువు ఉండడంతో ఈ సమయంలో పార్టీ అధినేతలు - అభ్యర్థులు ఎవరి లెక్కలు వారే వేసుకుంటున్నారు. ఎవరికి వారే గెలుపు తమదేనంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్ని సీట్లలో తాము వస్తామని - మరికొన్ని సీట్లలో ఫలానా కారణంతో వెనుకబడ్డామని ఫలితాలకు ముందే ప్రకటిస్తున్నారు. ఏపీలో ఏ పార్టీకి ఆ పార్టీ ఓంటరిగానే పోటీ చేశారు. అయితే ప్రధానంగా మాత్రం టీడీపీ - వైసీపీ - జనసేనల మధ్యే హోరాహోరీ సాగింది.

*అభివృద్ధి మంత్రమంటూ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి నవ్యాంధ్రప్రదేశ్‌ గా అవతరించిన 2014లో మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. ఈ ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. తమను అన్యాయంగా విడగొట్టినా.. కేంద్రం సపోర్టు లేకున్నా అభివృద్ధి విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదని సీఎం చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలతో పాటు రైతులను - నిరుద్యోగులను - మహిళలను ఆదరించిన తమను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం సుపంపన్నం చేస్తామని హామీలిచ్చారు. వృద్ధులకు పింఛన్‌ మొత్తాలను పెంచుతూ యువతకు ఉద్యోగాలను కల్పిస్తామని హామీలిచ్చారు.

*ఒక్కఛాన్స్‌ ఇవ్వండంటూ..

గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అభివృద్ధి పేరు చెప్పుకొని రాష్ట్రాన్ని దోచేస్తున్నాడని ప్రధాన ప్రతిపక్షనేత - వైసీపీ అధినేత జగన్‌ ప్రచారం చేశారు. సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం పర్యటించిన జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందో నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల వెంటే ఉన్నారు. అటు పార్టీ బలం పెంచుకునేందుకు కీలక నేతలను పార్టీలో చేర్చుకున్నారు. జగన్‌తో పాటు ఆయన తల్లి విజయమ్మ - చెల్లి షర్మిల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. వైఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి మళ్లీ తనతోనే సాధ్యమవుతుందని ప్రజలకు వివరించారు.

* పదవి కోసం కాకుండా.. ప్రశ్నించడానికని..

తాము రాజకీయాల్లోకి వచ్చింది పదవులను అనుభవించడానికి కాదని - ప్రశ్నించడానికని జనసేన పార్టీ స్థాపించిన పవన్‌ కల్యాన్‌ సైతం ప్రచార వేడిని పెంచారు. తన ప్రసంగాలతో ప్రధాన పార్టీల్లో వణుకు పుట్టించారు. కాపు సామాజిక ఓట్లతో పాటు - ఫ్యాన్స్‌ ను నమ్ముకొని ఎన్నికల బరిలో నిల్చున పవన్‌ పార్టీలో ఒక్కరూ సీనియర్‌ నేత లేకపోవడం ఆశ్చర్యకరం. అయితే 2009 ఎన్నికల్లో చిరంజీవికి వచ్చినన్ని సీట్లు వస్తాయా..? అంతకంటే తగ్గుతాయా..? అనే చర్చ సాగుతోంది. అయితే ఇక్కడ పవన్‌ రాజకీయ చతురతను పాటించారు. ముందు టీడీపీపై విమర్శలు గుప్పించిన పవన్‌ ఆ తరువాత జగన్‌ ను టార్గెట్‌ చేశారు. దీంతో కొందరు జనసేన - టీడీపీలు రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని గుసగుసలు వినిపించాయి. అయితే పవన్‌ మాత్రం వామపక్షాలు - బీఎస్పీతో మాత్రమే పొత్తు పెట్టుకొని సీట్లు పంచుకున్నారు. కానీ ప్రధాన పార్టీలను ఎన్ని నియోజకవర్గాల్లో కొల్లగొడుతారో చూడాలి.

ఇలా ముగ్గురు అధినేతలు మూడు పార్టీల నుంచి డిఫెరెంట్ స్ట్రాటజీతో ప్రచారం చేశారు. ఇప్పుడు తమకు పడ్డ ఓట్ల గురించి జిల్లాల వారీగా లెక్కలు తీస్తున్నారు. మహిళలు - వృద్ధులు - యువకులు - ఉద్యోగులు ఎటువైపు వేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వివిధ సర్వేలతో శూలశోధన చేస్తున్నారు. తమకే అనుకూలంగా ఓటింగ్ జరిగిందా అనే దానిపై ఆరా తీస్తున్నారు. మరి వీరి లెక్కలు ఎన్ని వేసినా ఎవరికి విజయం చేకూరుతుందనేది తేలాలంటే మే 23వరకు ఆగాల్సిందే..