Begin typing your search above and press return to search.

నిద్రపట్టడం లేదు.. ఫోన్లు చేసి సర్వేల చేయించుకుంటున్న నేతలు!

By:  Tupaki Desk   |   21 April 2019 1:30 AM GMT
నిద్రపట్టడం లేదు.. ఫోన్లు చేసి సర్వేల చేయించుకుంటున్న నేతలు!
X
ఎన్నడూ లేని రీతిలో ఈ సారి తెలుగు వాళ్లకు పోలింగ్ కు ఫలితాలకు మధ్యన చాలా గ్యాప్ వచ్చింది. ఇది వరకూ కూడా ఎన్నికల ప్రక్రియ ఇలా నెలల పాటే సాగేది. అయితే అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఆఖరి దశల్లో జరిగేది. దీంతో పోలింగ్ కు ఫలితాలకు మధ్యన పెద్ద సమయం ఉండేది కాదు. స్వల్పమైన గ్యాప్ తోనే ఫలితాలు వచ్చేసేవి.

అయితే ఈ సారి మాత్రం ఏకంగా నెలన్నర గ్యాప్. అందులో పది రోజులు అయితే గడిచిపోయినట్టే. ఇంకా నెలకు పైగా ఉంది ఫలితాల కోసం వేచి చూడాల్సిన సమయం.

రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారే ఈ విషయాల విషయంలో టెన్షన్ పడుతున్నారు. ఎవరు గెలుస్తారనే అంశం గురించి వారు రకరకాల సోర్సుల ద్వారా వాకబు చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసిన వారి పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. అత్యంత భారీ ‘పెట్టుబడులు’ సైతం పెట్టేసి నేతలు ఈ ఎన్నికల బరిలోకి దిగారు. వారికి ఇప్పుడు నిద్ర కూడా పట్టనట్టుగా ఉంది.

అందుకే .. కొందరు ఇప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. పోస్ట్ పోల్ సర్వేలుగా వారు పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఎలాగూ పోలింగ్ ముగిసింది. ఇలాంటి తరుణంలో ప్రజలు కూడా స్పందించకపోవచ్చు. ఎవరికి ఓటేశారని ప్రజలను అడిగితే.. వారు ఏ సమాధానం ఇవ్వరు. ఎందుకంటే.. ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది. ఎవరు గెలుస్తారో ఇంకా తెలీదు. ఇలాంటి తరుణంలో తాము ఎవరికి ఓటేసిందీ అవతల వాళ్లకు తెలిసిపోతే అంతే సంగతులు.. అనే భయం జనాలకు సహజంగానే ఉంటుంది.

అందుకే నేతలు ఫోన్ మార్గాన్ని ఎంచుకున్నారని, ఫోన్ల ద్వారా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఎవరికి ఓటేశారో చెప్పాలంటూ.. ఒకటీ - రెండు - మూడు నొక్కమని అంటున్నారట. జిల్లాల స్థాయిల్లో నేతలు ఇలాంటి సర్వేలు చేయించుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఈ సర్వేలను చేయించుకోవడంలో మునిగితేలుతున్నారని సమాచారం!