Begin typing your search above and press return to search.

'వార‌సత్వ' రాజ‌కీయ చ‌ద‌రంగంలో పావులెంద‌రో!

By:  Tupaki Desk   |   10 Oct 2018 2:30 PM GMT
వార‌సత్వ రాజ‌కీయ చ‌ద‌రంగంలో పావులెంద‌రో!
X
ఇద్ద‌రు భావ సారూప్య‌త క‌లిగిన వ్య‌క్తులు త‌మ ఆశ‌య సాధ‌న కోసం కృషి చేస్తుంటారు. అందులో ఒక‌రు త‌మ ఆశ‌యాల‌ విత్త‌నాన్ని నాటుతారు. ఆ విత్త‌నం నాటిన వ్య‌క్తికి...రెండో వ్య‌క్తి సాయం చేస్తుంటాడు. అత‌డి వెన్నంటే ఉండి ఆ విత్త‌నం చెట్ట‌యి...కాయ‌లు కాసేదాకా శ్రమిస్తాడు. తీరా ఆ కాయ‌లు కోసి తిందామ‌నుకునే లోపు....చెట్టునాటిన వ్య‌క్తి వారసులు వ‌చ్చి వాటిని లాగేసుకుంటారు. నోటికాడికి వ‌చ్చిన కాయ‌లు తినే ప్రాప్తం ద‌క్క‌లేద‌ని ఆ వ్య‌క్తి ప‌డే ఆవేద‌న వ‌ర్ణ‌నాతీతం. దీంతో, అసంతృప్తితో ఉన్న ఆ వ్య‌క్తి...సొంత‌గా వేరే విత్త‌నం నాటి...దానిని మ‌హా వృక్షం చేసేప‌నిలో ప‌డ‌తాడు. అయితే, ఆ వ్య‌క్తి నాటిన విత్త‌నం...ఎంత‌కాలంలో ఫ‌లాల‌నిస్తుందనేది చెప్ప‌లేని ప‌రిస్థితి. దాదాపుగా భార‌త దేశంలోని రాజ‌కీయ `వార‌సత్వ` వృక్షాల‌కు....ఆ ఫ‌లాల‌నిచ్చే `వృక్షాల‌`కు పెద్ద తేడా లేదు. ఆ పార్టీ...ఈ పార్టీ అని తేడా లేకుండా దేశంలో దాదాపు వార‌సులే పార్టీ ప‌గ్గాలు చేప‌డుతున్నారు. దేశంలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ మొద‌లుకొని.....కొద్ది సంవ‌త్స‌రాల క్రితం ఆవిర్భ‌వించిన‌ టీఆర్ ఎస్ వ‌ర‌కు....వారస‌త్వ రాజ‌కీయాల‌కు అతీతం కాదు.

ఒక పార్టీని న‌మ్ముకొని ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీకి సేవ చేసి...త‌న జీవితంలో సింహ‌భాగం ధార‌బోసిన నేత‌లు దేశంలో చాలామంది ఉన్నారు. అయితే, అన్నాళ్లు క‌ష్ట‌ప‌డి పార్టీ ప‌గ్గాలు త‌మ‌కు ద‌క్కే స‌మ‌యానికి....ఆ పార్టీ అధినేత వార‌సులు ఆ పగ్గాల‌నందుకున్న ఘ‌ట‌నలు అనేకం ఉన్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో త‌ర‌త‌రాలుగా కుటుంబ పాల‌న సాగుతోంది. నెహ్రూ నుంచి రాహుల్ వ‌ర‌కు ఆ ప‌రం ప‌ర‌కు బ్రేక్ లేదు. ఇక ప్రాంతీయ‌పార్టీల‌లో అయితే ఈ హ‌వా కొంచెం ఎక్కువ‌. టీడీపీలో బాబు త‌ర్వాత చిన‌బాబుకు ప‌గ్గాలందించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక‌, వార‌సుల్లో కూడా పోటీ ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. శివ‌సేన ప‌గ్గాల‌ను బాల్ థాక‌రే....ఉద్ధ‌వ్ థాక‌రేకు ఇవ్వ‌డంతో...బాల్ థాక‌రే మేన‌ల్లుడు రాజ్ థాక‌రే మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ సేన‌ను స్థాపించాడు.

ఇక‌, డీఎంకే క‌రుణానిధి అల్లుడు మురుసోలి మార‌న్ కూడా ఇదే త‌ర‌హాలో వేరు కుంప‌టి పెట్టాల‌ను చూశారు. కానీ, ఆ త‌ర్వాత డీఎంకేలో కొన‌సాగుతూ...ఆయ‌న‌ - ఆయ‌న పిల్ల‌లు వ్యాపారాల్లో బిజీ అయ్యారు. ఇక‌, మ‌రో ప్రాంతీయ‌పార్టీ తెలంగాణ‌లో ఇంటిపోరు ఆస‌క్తిక‌రం. దాదాపుగా టీఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీష్ ఉన్నారు. పార్టీలో ఆయ‌నే నెంబ‌ర్ 2 గా చాలాకాలం చ‌లామ‌ణీ అయ్యారు. అయితే, 2014లో కేటీఆర్ - క‌విత‌ల రాక‌తో హ‌రీష్ కు ప్రాధాన్యం త‌గ్గింద‌ని టాక్. గ‌తంలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొనే హ‌రీష్...ఇపుడు బొత్తిగా న‌ల్ల‌పూస‌య్యారు. పైకి మాత్రం త‌న‌కు కేటీఆర్ తో పోటీ లేద‌ని చెప్పినా...లోప‌ల కోల్డ్ వార్ జ‌రుగుతోంద‌ని పుకార్లు వ‌స్తున్నాయి. ముంద‌స్తుకు ముందో ...త‌ర్వాతో టీఆర్ ఎస్ లో `హ‌రీష్` ముస‌లం త‌ప్ప‌ద‌ని ఊహాగానాలు వ‌స్తున్నాయి. వేరు కుంప‌టి పెట్టేందుకు హ‌రీష్ రెడీ అవుతున్నార‌ని టాక్. ఏది ఏమైనా...తాము ఆశించిన స్థానాన్ని గ‌ద్ద‌లా ఎగ‌రేసుకుపోతోన్న వార‌సుల‌పై మిగ‌తా వారికి ఆ మాత్రం అక్క‌సు ఉండ‌డం స‌హ‌జ‌మ‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. `వార‌సత్వ` రాజ‌కీయ క్రీడ‌లో పావులుగా చాలామంది మారుతున్నార‌ని అనుకుంటున్నారు.