Begin typing your search above and press return to search.

రాజాసింగ్ ను కొట్టారా? తానే రాయితో కొట్టుకున్నారా?

By:  Tupaki Desk   |   20 Jun 2019 8:51 AM GMT
రాజాసింగ్ ను కొట్టారా? తానే రాయితో కొట్టుకున్నారా?
X
గురువారం అర్థ‌రాత్రి హైద‌రాబాద్‌ లోని జుమ్మెరాత్ బ‌జార్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఈ ఉద‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించింది. స్వాతంత్య్రం స‌మ‌ర‌యోథురాలు రాణి అవంతి భాయ్ విగ్ర‌హాన్ని పున‌ర్ ప్ర‌తిష్ఠించేందుకు ప్ర‌య‌త్నించ‌టం.. వారిని పోలీసులు అడ్డుకోవ‌టం తెలిసిందే. ముంద‌స్తుగా అనుమ‌తి తీసుకోకుండా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టినందుకు పోలీసులు అడ్డుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన గోషామ‌హ‌ల్ బీజేపీ ఎంపీ రాజాసింగ్ కు పోలీసులు జ‌రిగిన దాడిలో గాయ‌మైన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఆయ‌న త‌ల‌కు గాయం కావ‌టం.. ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించి ఆయ‌న‌కు చికిత్స చేశారు. అనంత‌రం ఆయ‌న ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. పోలీసుల కార‌ణంగా రాజాసింగ్ కు గాయ‌మైన వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మార‌టంతో పాటు.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

బీజేపీ ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేయ‌టాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు బీజేపీ పార్టీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేయ‌టం అమానుష‌మ‌ని.. ప్ర‌జాప్ర‌తినిధిని ర‌క్తం వ‌చ్చేలా కొట్ట‌టం దారుణ‌మ‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.

తెలంగాణ‌లో ప్ర‌జా పాల‌న ఉందా? ర‌జాకార్ల పాల‌న సాగుతుందా? అన్న ప్ర‌శ్న‌ను వేశారు. పోలీసుల దాడిలో గాయ‌ప‌డ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఆయ‌న నివాసంలో ల‌క్ష్మ‌ణ్.. ఎమ్మెల్సీ రామ‌చంద్ర‌రావు త‌దిత‌రులు పరామ‌ర్శించారు. రాజాసింగ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తాను భ‌గ‌వంతుడ్ని ప్రార్థిస్తున్న‌ట్లుగా ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు.

ఒక ఎమ్మెల్యేకు ర‌క్ష‌ణ లేకుంటే సామాన్యుల ప‌రిస్థితి ఏమిట‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో బీజేపీకి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను ఓర్చుకోలేక ఇలా చేస్తున్నార‌ని ఆరోపించారు. రాజాసింగ్ పై దాడికి పాల్ప‌డిన గోషామ‌హ‌ళ్ ఎసీపీ న‌రేంద‌ర్.. అసిఫ్ న‌గ‌ర్ ఏసీపీ న‌ర్సింహారెడ్డి.. ఇత‌ర పోలీసుల అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే.. పోలీసుల వాద‌న మ‌రోలా ఉంది. ఎమ్మెల్యే రాజాసింగ్ పై తాము దాడి చేయ‌లేద‌ని.. ఆయ‌నే త‌న‌కు తానుగా గాయ‌ప‌ర్చుకున్నార‌న్నారు. అనుమ‌తి లేకుండా విగ్ర‌హం పెట్ట‌టాన్ని త‌ప్పు అడ్డుకున్నామే త‌ప్పించి.. ఎలాంటి దాడి చేయ‌లేద‌న్నారు. రాజాసింగే త‌న‌కు తాను రాయితో కొట్టుకున్నాడ‌ని.. అందుకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

పోలీసుల‌పై రాజాసింగ్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రాజాసింగ్ త‌న‌కు తాను రాయితో గాయ‌ప‌ర్చుకున్నార‌ని చెబుతున్న ఒక‌వీడియోను హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌న్ కుమార్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో వైర‌ల్ గా మారింది. అయితే.. ఈ వీడియోలో ఒక‌రు రాయితో కొట్టుకోవ‌టం క‌నిపిస్తుంది కానీ.. ఆ కొట్టుకున్న‌ది ఎవ‌ర‌న్న విష‌యం అస్ప‌ష్టంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.