Begin typing your search above and press return to search.

వారు మనుషులేనా?:30 మంది చేతిలో రేప్

By:  Tupaki Desk   |   9 Oct 2015 4:32 AM GMT
వారు మనుషులేనా?:30 మంది చేతిలో రేప్
X
నోట వెంట మాట రాని పరిస్థితి. రాసే పదాల్ని కూర్చుకునేందుకు వణుకుతున్న చేతిని సరి చేసుకుంటూ రాయాల్సిన దుస్థితి. ఏం చెప్పాలి.. మరేం మాట్లాడాలి? కనురెప్పే కాటేసిన ఈ దుర్మార్గ ఘటన గురించి చెప్పాలా? వద్దా? అన్న సందేహం కలిగినా.. ఇంత నీచ నికృష్టమైన విషయం గురించి సమాచారం ఇవ్వటం ద్వారా.. చుట్టూ ఎంత ప్రమాదకరమైన మనుషులు ఉన్నారన్న విషయాన్ని తెలియజేయటంతో పాటు.. మరెంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేయాలన్న లక్ష్యంతో ఈ వార్తను అందిస్తున్నారు.

తమిళనాడులో తాజాగా బయటకు వచ్చిన ఈ ఘటన సంచలనం రేపటమే కాదు.. విన్నవారంతా షాక్ కు గురయ్యే పరిస్థితి. ముక్కుపచ్చలారని ఒక బాలికకు కలిగిన కష్టం గురించి తెలిస్తే.. ఇంత చిన్న వయసుకు ఇన్ని కష్టాలా? అని కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఆరోగ్యనగర్ కు చెంది ముత్తుపాండి అనే వ్యక్తికి యాభైఏళ్లు. అతని భార్య కొద్దికాలం క్రితం మరణించింది. అతనికి 23ఏళ్ల కుమారుడు కార్తీక్.. 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఆమెపై ఆమె తండ్రి అత్యాచారం చేస్తున్నారంటూ ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై మద్రాసు హైకోర్టులు ప్రజా ప్రయోజన వాజ్యం నమోదైంది.

దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ సదరు బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఆదేశించారు. ఆమె నోరు విప్పటంతో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. తన తండ్రి మాత్రమే కాదు.. అన్న.. వారి స్నేహితులు.. చివరకు పోలీసులు కూడా తనపై అత్యాచారం చేశారని.. మొత్తం 30 మంది తనను రేప్ చేసినట్లుగా సదరు బాలిక వెల్లడించింది.

ఇదో షాకింగ్ గా మారింది. తన తండ్రి.. అన్న.. వారి స్నేహితులు అత్యాచారం చేయటంతో.. వారిపై ఫిర్యాదు చేయటానికి వెళితే.. అక్కడ సీఐ.. ఎస్ ఐ లు స్టేషన్ లోనే తనపై అత్యాచారం చేశారని వెల్లడించింది. దీనిపై విచారణ జరిపిన శివగంగ ఏఎస్సై నందితా పాండే.. సీఐ శివశంకర్ ను విధుల నుంచి తప్పించారు. ప్రస్తుతం సదరు బాలికను చెన్నైలోని ఒక సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఇప్పుడీ ఉదంతం చెన్నైలో సంచలనం సృష్టిస్తోంది.