Begin typing your search above and press return to search.

పిచ్చి పీక్స్ః పోకేమాన్ ఆడుతూ దేశం దాటేశారు

By:  Tupaki Desk   |   25 July 2016 5:14 AM GMT
పిచ్చి పీక్స్ః పోకేమాన్ ఆడుతూ దేశం దాటేశారు
X
ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్ పోకెమాన్ ఇపుడు మ‌రింత క‌ల‌క‌లం సృష్టిస్తోంది. పోకేమాన్ క్రేజ్‌లో ప‌డి ఇబ్బందుల పాల‌వుతున్న విష‌యాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తూ షాకింగ్‌కు గురిచేస్తున్నాయి. ఈ గేమ్ ఆడుతూ ఇటీవల అమెరికాలో ఓ వాహనదారుడు పోలీసు వాహనాన్నే గుద్దేశాడు! మరో ఘటనలో ఈ గేమ్‌ను మ‌త్తులో ప‌డి ఓ యువతి తల చెట్టుకొమ్మల్లో ఇరుక్కుపోయింది!! తాజాగా ఆటలో మునిగిపోయి కెనడాకు చెందిన ఇద్దరు సోదరులు ఏకంగా అమెరికా-కెనడాసరిహద్దు దాటడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

కెనడా ప్రావిన్స్ అల్బెర్టా నుంచి మొంటానాకు పోకెమాన్ గో ఆడుతూ ఇద్దరు యువకులు తమకు ఎదురుపడ్డారని, వారు తమకు తెలియకుండానే సరిహద్దును దాటేశారని వెంటనే గుర్తించగ‌లిగామని యూఎస్ బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు పేర్కొన్నారు. ఆ ఇద్దరు పోకెమాన్ ఆడుతూ దారితప్పారని, అసలు వారు ఎక్కడ ఉన్నారో వారికే తెలియదనే విషయాన్ని ప్రాథమిక విచారణలో తెలుసుకొన్నామని అధికారులు తెలిపారు. ఫోన్లలో గేమ్ ఆడుతూ కెనడా నుంచి అక్రమంగా అమెరికా భూభాగంలోకి ప్రవేశించిన ఆ ఇద్దరిని పట్టుకొన్నామని వివ‌రించారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్న ఆ ఇద్దరి గురించి తల్లి వాకబు చేయగా, వారిని ఆమెకు అప్పగించామని పోలీసులు వెల్లడించారు. జీపీఎస్ - గూగుల్ మ్యాప్ ఆధారిత వీడియో గేమ్ పలు దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ రియాలిటీ గేమ్‌ను వివిధ కారణాలతో పలు దేశాలు నిషేధిస్తుండటం గమనార్హం.