Begin typing your search above and press return to search.

పరిపూర్ణ కలలు ఇవీ.. బీజేపీలో నెరవేరుతాయా.?

By:  Tupaki Desk   |   20 Oct 2018 7:30 AM GMT
పరిపూర్ణ కలలు ఇవీ.. బీజేపీలో నెరవేరుతాయా.?
X
ఇన్నాళ్లు కాషాయ వస్త్రాలు ధరించి భక్తి ప్రవచనాలు చెప్పే స్వామిజీ ఇప్పుడే అదే కాషాయ రంగున్న బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో పరిపూర్ణనంద ఆయన ధరించిన దుస్తులు అలాగే ఉంచుకుంటే చాలు. ఒక్క కమలం గుర్తు దానికి జోడిస్తే సరి.. భక్తి భావాలు ప్రవచిస్తే శ్రద్ధగా విన్న జనాలు.. ఇప్పుడు కాషాయ కండువాతో ప్రచారం చేస్తే నమ్ముతారా నమ్మరా అన్నది వేరే విషయం. కానీ పరిపూర్ణ నంద బీజేపీలోకి ఎందుకు చేరావంటే చెప్పిన కారణం మాత్రం సిల్లీగా ఉందని విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు.

దసరా సందర్భంగా అమ్మవారికి నవరాత్రులు దీక్ష చేయడం ఆ భక్తులకు అలవాటు. ఇప్పుడు పరిపూర్ణ నంద కూడా 9 రోజులు బీజేపీలో చేరికపై నిరాహార దీక్ష చేసి ఆత్మపరిశీలన చేసుకున్నాడట.. రాజకీయాల్లోకి తాను తగినవాడినా అని.. ఇమడగలా.? పనిచేయగలనా అని ప్రశ్నించుకున్నాడట.. విజయదశమితో పదిరోజులు పూర్తి చేసుకొని బీజేపీలోకి చేరానని పరిపూర్ణనంద క్లారిటీ ఇచ్చాడు.

పార్టీలు మారడం.. కండువాలు వేసుకోవడం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చొక్కాలు మార్చినంత ఈజీ.. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ఫార్ములా హిట్ కావడంతో ఓ చానెల్ ఎండీగా వ్యవహరిస్తూ.. స్వామిగా తెలుగునాట విశేష ప్రాచుర్యం పొందిన పరిపూర్ణనందను బీజేపీ అధిష్టానం వలవేసి పట్టుకుంది. దీనికి స్వామి కూడా సరేనని ఓ కొత్త స్టోరీని చెప్పి కమలతీర్థం పుచ్చుకున్నాడు. ఆ 9 రోజులు దీక్ష చేశానని చెప్పడం కంటే.. ఆ 9 రోజులు బీజేపీతో బేరసారాలు సాగించారనే విషయం బయటకు పొక్కింది. సరే ఎలాగూ చేరాడు. ఆ తర్వాత మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని.. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని బాగానే చెప్పుకొచ్చాడు..

నిజానికి తెలంగాణలో అంతో ఇంతో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి దక్కకుండా చేయాలని.. బీజేపీ ప్లాన్ చేసింది. అందుకే బలమైన పరిపూర్ణనందను బీజేపీలోకి చేర్చుకొందని టాక్. ఈ ప్లాన్ తో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగినన్ని సీట్లను ‘గులాబీ’ స్నేహహస్తంతో గెలుపొందాలని యోచిస్తోందట.. చూడాలి మరి యోగి ఆదిత్యానాథ్ లో ఎదగాలని కలలుగంటున్న పరిపూర్ణ ఆశలు నెరవేరుతాయో లేదో.