బాలీవుడ్ సాంగ్ రీమిక్స్ తో కేంద్రమంత్రి వార్నింగ్

Wed Feb 20 2019 10:49:59 GMT+0530 (IST)

పాపులర్ పాటల్ని తమ ప్రచారాలకు వాడుకోవటం తెలిసిందే. అది వ్యాపారమైనా.. రాజకీయమైనా దేనికైనా సరే.. పాపులర్ పాటల్ని రీమిక్స్ చేస్తుంటారు. తాజాగా అదేపనిని చేసింది రైల్వే శాఖ. ఇటీవల విడుదలైన గల్లీ బాయ్ మూవీలోని అప్నా టైం ఆయేగా అనే పాపులర్ పాటను తమకు తగినట్లుగా మార్చుకుంది రైల్వే శాఖ.బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్.. అలియాలు జంటగా నటించిన ఈ సినిమాలో పాపులర్ పాటను.. రీమిక్స్ చేశారు. టికెట్ లేకుండా ట్రైన్లలో ప్రయాణించే వారిని హెచ్చరిస్తూ ఒక వీడియోను రూపొందించారు. రైలులో టికెట్ల తనిఖీ.. టికెట్ లేని వారికి ఫైన్ వేస్తారని.. అలా కాకుండా రైల్వేస్టేషన్లో కానీ రైల్వే యాప్ ద్వారా కానీ టికెట్ కొనుగోలు చేయాలన్న సందేశంతో ఈ ప్రకటనను పూర్తి చేశారు.

తేరా టైం ఆయేగా అంటూ రీమిక్స్ చేసిన ఈ బాలీవుడ్ సాంగ్ ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తాజాగా విడుదల చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో కేంద్రమంత్రి షేర్ చేశారు. రైళ్లల్లో ప్రయాణించే సమయంలో టికెట్ లేకుండా జర్నీ చేసే వారిని హెచ్చరిస్తూ ఈ పాటను రూపొందించారు. ఈ పాట ఇప్పుడు వైరల్ గా మారి.. అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.