స్వీటీని చూసి కేసీఆర్ ఖుషీ అయ్యారు

Mon Jul 17 2017 10:24:32 GMT+0530 (IST)

స్వీటీ అన్న వెంటనే సినీనటి అనుష్క అనుకునేరు. ఆమెకు.. ఈ వార్తకు అస్సలు సంబంధం లేదు. ఇంతకీ ఈ స్వీటీ ఎవరు? ఆమెను చూసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకంత ఖుషీ అయ్యారన్న విషయంలోకి వెళితే..ఈ ఉదంతం ఆసక్తికరంగా ఉండటమే కాదు.. మరింతమందికి స్ఫూర్తినిస్తుందనటంలో సందేహం లేదు.

కొంతకాలం క్రితం తనకు పైలెట్ కోర్సు చేయాలని.. కానీ.. చదువుకునేందుకు అవసరమైన ఆర్థిక బలం తమకు లేదంటూ ఒక అమ్మయి ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభ్యర్థించారు. వెనువెంటనే స్పందించిన ఆయన.. ఆమె చదువు నిమిత్తం ఏకంగా రూ.30 లక్షల సాయాన్ని ప్రకటించి చాలామందికి ఆశ్చర్యానికి గురి చేశారు. ధనిక రాష్ట్రంలో ఆర్థికలేమి కారణంగా ఎలాంటి అవకాశాల్ని మిస్ చేసుకోకూడదన్నది కేసీఆర్ ఆకాంక్షగా చెబుతారు.

అందుకే.. మరో ఆలోచన లేకుండా మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన సంజన అలియాస్ స్వీటీ పైలెట్ కోర్సుకు అవసరమైన రూ.30 లక్షల్ని సాయంగా అందించారు. ఈ సందర్భంగా ఆమెను ఆశీర్వదిస్తూ.. బాగా చదువుకోవాలని.. మంచి ఉద్యోగం సాధించాలన్నారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులతో అమెరికాలో పైలట్ కోర్సు చేసిన స్వీటీ.. కేసీఆర్ కలల్ని నిజం చేశారు. అమెరికాలో కోర్సును విజయవంతంగా ముగించటమేకాదు.. ఉద్యోగాన్ని కూడా సంపాదించారు. తాజాగా ఆమె.. కేసీఆర్ ను కలిశారు. తన విజయాన్ని ఆయనతో పంచుకున్నారు. పైలట్ కోర్సు పూర్తి చేసి.. ఉద్యోగం వచ్చిందన్న విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ తెగ సంబరపడిపోయారు. అప్యాయంగా దగ్గరకు తీసుకొని మనసారా ఆమె మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నిజానికి ఇలాంటివి మరింత మందికి స్ఫూర్తిని ఇవ్వటతో పాటు.. సాయానికి వచ్చే వారికి అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి తలంపును మరింత పెంచుతాయనటంలో సందేహం లేదు. ఏమైనా.. కష్టపడి ఎదిగిన స్వీటీ మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షిద్దాం. ఆల్ ద బెస్ట్ చెబుదాం.