Begin typing your search above and press return to search.

పంది..ప‌ర‌దేశీ..భార‌త సంత‌తి వ్య‌క్తిపై కామెంట్స్!

By:  Tupaki Desk   |   23 Aug 2017 4:27 PM GMT
పంది..ప‌ర‌దేశీ..భార‌త సంత‌తి వ్య‌క్తిపై కామెంట్స్!
X
ట్రంప్ అధ్య‌క్షుడ‌య్యాక‌ అమెరికాలో జాత్యాహంకార దాడులు - విద్వేష పూరిత వ్యాఖ్య‌లు పెరిగిన సంగ‌తి తెలిసిందే. ట్రంప్ ఏకంగా 6 ముస్లిం దేశాల ప్ర‌జ‌లు అమెరికాలో అడుగుపెట్టేందుకు ఆంక్ష‌లు విధించారు. ట్రంప్ లోకల్ సెంటిమెంట్ ను అమెరిక‌న్లు బాగా వంట‌బ‌ట్టించుకున్నారు. త‌ల్లి చేలో మేస్తే దూడ గ‌ట్టున మేయ‌దు క‌దా అన్న‌ట్లుగా కొందరు అమెరిక‌న్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా, భార‌తీయ సంత‌తికి చెందిన ఓ వ్యాపార‌వేత్త‌పై అమెరిక‌న్లు జాత్యాహంకార వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు, ఆ వ్యాపార‌వేత్త‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తూ భార‌త్ కు వెళ్లిపోవాల‌ని హెచ్చరిక‌లు జారీ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై అమెరికాలోని భార‌తీయులు మండిప‌డుతున్నారు.

అమెరికాలో జరిగిన చార్లెసట్ విల్లే ఘ‌ట‌నపై ట్రంప్ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తూ జీఎంఎం నాన్‌స్టిక్ కోటింగ్స్ సంస్థ‌కు సీఈఓగా ఉన్న ర‌వీన్ గాంధీ సీఎన్‌ బీసీలో ఓ వ్యాసం పోస్ట్ చేశారు. ట్రంప్ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి - ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఎంత ముందుకు తీసుకెళ్లినా, చార్లెస‌ట్‌ విల్లే త‌ర‌హా ఘ‌ట‌నల‌ త‌ర్వాత ఆయ‌న‌పై న‌మ్మ‌కం పోయిందని త‌న వ్యాసంలో పేర్కొన్నారు. అమెరికాలో జ‌రుగుతున్న జాత్యాహంకార దౌర్జ‌న్యాల‌పై ట్రంప్ ఉదాసీన వైఖ‌రిని తూర్పార‌బ‌ట్టారు. ఇక నుంచి ట్రంప్ విధానాల‌కు మ‌ద్ద‌తు తెలప‌న‌ని గాంధీ తన వ్యాసంలో రాశారు. దీంతో, ర‌వీన్ గాంధీపై ట్రంప్ మద్దతుదారులు వివక్షాపూరితమైన వ్యాఖ్యల‌తో విరుచుకుప‌డ్డారు. వారు ... రవీన్‌గాంధీపై ట్వీట్లు - పోన్లు - ఈమెయిళ్ళ ద్వారా జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు.

ఈ నేప‌థ్యంలో త‌నకు చాలా బెదిరింపు ఈ మెయిళ్లు - ఫోన్ కాల్స్ వ‌చ్చాయ‌ని, త‌న‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విష ప్ర‌చారం చేస్తున్నాని ర‌వీన్ గాంధీ తెలిపారు. తాను బ‌య‌ట‌కు చెప్పుకోలేని విధంగా కొంద‌రు దూషించార‌ని చెప్పారు. త‌న‌కు ఓ యువ‌తి ఫోన్ చేసి....పంది...ప‌ర‌దేశీ..అంటూ దుర్భాష‌లాడింద‌ని గాంధీ పేర్కొన్నారు. ఆ యువ‌తి త‌న‌ను దూషించిన ఫోన్ కాల్ వీడియోను యూట్యూబ్‌ లో షేర్ చేశారు. త‌నను చాలా మంది అత్యంత హేయ‌మైన భాష‌లో దూషించార‌ని గాంధీ మీడియాకు తెలిపారు.