Begin typing your search above and press return to search.

అధికారికం: స‌ండే పెట్రోల్ బంకులు బంద్‌!

By:  Tupaki Desk   |   19 April 2017 5:58 AM GMT
అధికారికం: స‌ండే పెట్రోల్ బంకులు బంద్‌!
X
ఆదివారం అంద‌రికి ఆట‌విడుపు. మారిన జీవ‌న‌శైలికి త‌గ్గ‌ట్లు.. గ‌తంలో మాదిరి కాకుండా వీకెండ్ వ‌స్తుందంటే.. బ‌య‌ట‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. గ‌డిచిన ప‌దిహేనేళ్లుగా ఈ ట్రెండ్ పెరుగుతుందే కానీ త‌గ్గ‌ట్లేదు. ప్రాశ్చాత్య సంస్కృతి ప్ర‌భావం కావొచ్చు.. జీవ‌న‌విధానం కావొచ్చు.. శుక్ర‌వారం సాయంత్రం నుంచే వీకెండ్ మూడ్‌ లోకి న‌గ‌ర‌జీవులు వెళ్లిపోతున్నారు. ఇక‌.. ప‌ట్ట‌ణ‌.. గ్రామీణ ప్రాంతాల్లో శ‌నివారం వ‌చ్చిందంటే చాటు.. ఆదివారం ఎక్క‌డికి వెళ్లాల‌న్న ప్లాన్లు వేసేసుకుంటున్నారు.

చాలాచోట్ల‌.. చాలా ఫంక్ష‌న్లను వీలైనంత‌వ‌ర‌కూ వీకెండ్ ప్లాన్ చేస్తున్న వారు లేక‌పోలేదు. ముహుర్తాలు సెట్ కాక‌పోతే వీక్ మ‌ధ్య‌లో కానీ.. ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా.. వీకెండ్ అయితే చాలావ‌ర‌కూ బెట‌ర్ అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది. ఇదంతా చెప్ప‌టం ఎందుకంటే.. వీకెండ్ మ‌న జీవితాల్లో ఎంత ముఖ్యంగా మారిందో చెప్ప‌టానికే. ఇలాంటి వీకెండ్ రోజుల్లో పెట్రోల్ బంకులు మూసేయాల‌న్న చిత్ర‌మైన నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టం క‌నిపిస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు.. ఏడు రాష్ట్రాలు.. కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిల‌లో వ‌చ్చే నెల 14 నుంచి ప్ర‌తి ఆదివారం పెట్రోల్ బంకుల్ని మూసివేసి ఉంచాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఇంకాస్త క‌చ్ఛితంగా చెప్పాలంటే.. శ‌నివారం రాత్రి 11 గంట‌లు మొద‌లు సోమ‌వారం తెల్ల‌వారుజామున 5 గంట‌ల వ‌ర‌కూ పెట్రోల్ బంకులు మూసివేసి ఉంటాయ‌న్న మాట‌. ఇంత‌కీ ఈ నిర్ణ‌యం ఎందుక‌న్న విష‌యాన్ని చూస్తే.. ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క‌మాన‌దు. ఆ మ‌ధ్య‌న ప్ర‌ధాని మోడీ త‌న మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఇంధ‌న వినియోగాన్ని త‌గ్గించాల‌ని కోరారు. దీంతో స్ఫూర్తి పొందిన పెట్రోల్ బంకుల య‌జ‌మానులు ఆదివారంపూట బంకుల్ని మూసి ఉంచాల‌న్న చిత్ర‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌నున్న రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. ఏపీ - తెలంగాణలతోపాటు తమిళనాడు - కేరళ - కర్ణాటక - మహారాష్ట్ర - హరియాణా ఉన్నాయి.

ఈ నిర్ణ‌యం కార‌ణంగా ఎంత ఇబ్బంద‌న్న‌ది చూస్తే.. వీకెండ్ అన్న వెంట‌నే బ‌య‌ట‌కు వెళ్లే చాలామంది కానీ.. వారం మొత్తం ప‌నుల ఒత్తిడితో ఉండి.. వీకెండ్ రోజుల్లో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఫిల్ చేయ‌టం లాంటి ప‌నులు చేసుకున్న వారికి ఇక‌పై దెబ్బ ప‌డ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న మైండ్ సెట్ ప్ర‌కారం.. ఎప్పుడు అవ‌స‌రం అనుకుంటే అప్పుడు పెట్రోల్ దొరికే ప‌రిస్థితి. అది కాస్తా పోయి.. శ‌నివారం రాత్రి త‌ర్వాత నుంచి పెట్రోల్ బంకులు మూసేస్తారంటే.. పెట్రోల్ బంకులు కిట‌కిట‌లాడ‌ట‌మే కాదు.. అవ‌స‌రానికి పెట్రోల్‌.. డీజిల్ దొర‌క్క నానా యాత‌న ప‌డాల్సిందే. వీకెండ్ రోజున లాంగ్ డ్రైవ్‌ ల‌కు.. దూర ప్రాంతాల‌కు వెళ్లి వ‌చ్చే వారు.. గ‌మ్య‌స్థానానికి అవ‌స‌ర‌మైన పెట్రోల్‌.. డీజిల్ కోసం ఏం చేయాల‌న్న‌ది ప్ర‌శ్న‌.

నిజంగా ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాల‌న్న‌దే ఆలోచ‌న అయితే.. శుక్ర‌వారం నుంచి ఆదివారం వ‌ర‌కూ విమానాలు.. రైళ్లు.. బ‌స్సులు మొత్తం ఆపేస్తే స‌రిపోతుంది క‌దా? అప్పుడు జ‌న‌జీవ‌నం మొత్తం స్తంభించిపోయి.. ఎవ‌రి ఇళ్ల‌ల్లో వారు ఉంటారు. అప్పుడు ప‌ర్యావ‌ర‌ణానికి మ‌రింత మేలు క‌లుగుతుంది.

అంతేకాదు.. వీకెండ్ రోజుల్లో సినిమా హాళ్లు.. పార్కులు.. మాల్స్‌.. వాణిజ్య కూడ‌ళ్లు.. హోట‌ళ్లు.. రెస్టారెంట్లు.. ఎమ్యూజ్ మెంట్ పార్కులు.. దేవాల‌యాలు లాంటివి కూడా మూసేస్తే మ‌రింత బాగుంటుంది. ఎందుకంటే.. వాటి కోసం జ‌నం బ‌య‌ట‌కు రావ‌టం.. దాని కోసం వాహ‌నాలు వాడి ప‌ర్యావ‌ర‌ణాన్ని దెబ్బ తీస్తారు కాబ‌ట్టి.. ఈ మొత్తాన్ని ఆపేస్తే ఇంకాస్త బాగుంటుంది. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగేలా నిర్ణ‌యాలు తీసుకునే ముందు.. కాస్త బుర్ర‌పెట్టి ఆలోచిస్తే బాగుంటుందేమో. పెట్రోల్ బంకుల్ని ఆదివారం క్లోజ్ చేయ‌టం అంటే.. బ్లాక్ మార్కెట్‌ను బొట్టు పెట్టి మ‌రీ పిలవ‌ట‌మే. క్యూల‌ను ఆహ్వానించిన‌ట్లే. ప్ర‌శాంతంగా గ‌డిచిపోయే వ్య‌వ‌స్థ‌ను.. అన‌వ‌స‌ర‌మైన నిర్ణ‌యాల‌తో ఆగ‌మాగం చేసేలా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ఆపేస్తే మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/