Begin typing your search above and press return to search.

వామ్మో.. ఈ బాదుడేంది మోడీ సాబ్

By:  Tupaki Desk   |   1 Sep 2016 5:28 AM GMT
వామ్మో.. ఈ బాదుడేంది మోడీ సాబ్
X
మోడీ మాటలు ఎంత తియ్యగా ఉంటాయో.. చేతలు అంత చేదుగా ఉంటాయి. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు దేశ ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి. తాము అధికారంలోకి రావాలే కానీ.. అవినీతి తగ్గించేసి పెట్రోల్.. డీజిల్ ఛార్జీలు భారీగా తగ్గించేస్తామంటూ సార్వత్రిక ఎన్నికల ముందు సోషల్ మీడియాలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. మోడీ పరివారం పవర్ లోకి వచ్చి దాదాపు 27 నెలలు కావొస్తున్నా.. పెట్రోలియం ఛార్జీలు ఏ మేరకు తగ్గాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనమైనా.. ఆ ఫలాలు సామాన్యులకు అందలేదు.

యూపీఏ హయాంలో బ్యారెల్ ముడి చమురు 125 డాలర్లు టచ్ చేసిన దానితో పోలిస్తే.. మోడీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 30 డాలర్ల కంటే కనిష్ఠంగా ధరలున్నప్పుడు సైతం లీటరు పెట్రోల్ రూ.60కు మించి తగ్గింది లేదు. బ్యారెల్ కు ఏకంగా వంద డాలర్ల ధర పడిపోయిన తర్వాత కూడా ధరలో బారీగా మార్పులు వచ్చింది లేదు.

ప్రతి పదిహేను రోజులకోసారి పెట్రోలియం ధరల్ని సమీక్షించే విధానానికి తగ్గట్లే పావలా.. అర్థరూపాయి.. రూపాయి చొప్పున ధరల్ని తగ్గించే మోడీ సర్కారు.. బాదే సందర్భంలో మాత్రం వెనుకా ముందు చూసుకోకుండా బాదేయటం కనిపిస్తుంది. ధరలు ఎంత భారీగా పడిపోయిన ఆ స్థాయిలో ధరల్ని తగ్గించని తీరుకు భిన్నంగా.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో ఏ చిన్న కదలిక వచ్చినా ఆ మొత్తాన్ని భారీగా ప్రజల మీద పడేలా నిర్ణయం తీసుకోవటంలో మోడీ సర్కారు తర్వాతే ఎవరైనా.

తాజాగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని సమీక్షించిన అధికారులు ఈసారి భారీ వడ్డింపుల దిశగా నిర్ణయం తీసుకున్నారు. గడిచిన రెండునెలలు (నాలుగు దఫాలు)గా స్వల్పంగా తగ్గించిన పెట్రోల్.. డీజిల్ ధరలకు భిన్నంగా ఈసారి ఏకంగా లీటరు పెట్రోల్ రూ.3.38 చొప్పున పెంచటం గమనార్హం. అదే సమయంలో డీజిల్ ధరల్ని సైతం లీటరుకు రూ.2.67 చొప్పున పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ధరలు తగ్గించే విషయంలో పీనాసిగా వ్యవహరించే మోడీ సర్కారు.. పెంచే విషయంలో మాత్రం సగటు ‘గుజరాతీ’ వ్యాపారి తీరును ప్రదర్శించటం కనిపిస్తుంది.