Begin typing your search above and press return to search.

జేబులకు చిల్లు; ఈసారి బాదిపారేశారు

By:  Tupaki Desk   |   1 Jun 2016 4:22 AM GMT
జేబులకు చిల్లు; ఈసారి బాదిపారేశారు
X
అచ్చేదిన్ అంటోంది మోడీ సర్కారు. కానీ.. అలాంటివేమీ కనుచూపు దూరంలో కనిపించని దుస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ ఉప్పు.. పప్పుతో సహా అన్ని ధరలు పెరగటమే కానీ తగ్గే సూచనలు కనిపించని పరిస్థితి. సరే.. ఎక్కడో ఉన్న మోడీనే కాదు.. మనకు దగ్గర్లో ఉన్న ఇద్దరు చంద్రుళ్లు సైతం సగటుజీవుల్ని బాదేయటానికి వెనుకాడటం లేదు. అలా చేస్తాం.. ఇలా చేస్తాం అంటూ రంగుల కలల్ని చూపించే అధినేతలు వాస్తవంలో మాత్రం అవేమీ కనిపించని పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ.. ప్రతి అంశానికి సంబంధించిన భారం పెంచటమే తప్పించి.. రిలాక్స్ అయ్యే పరిస్థితి అస్సలు కనిపించని దుస్థితి.

తాజాగా పెట్రోల్.. డీజిల్ ధరలు భగ్గుమనటమే కాదు.. కొత్త పన్నులు సైతం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. చమురు ధరల మీద నియంత్రణను కేంద్రం ఎత్తివేసిన తర్వాత అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ధరల్ని సమీక్షిస్తూ హెచ్చుతగ్గులు చేయటం తెలిసిందే. రికార్డు స్థాయిలో చమురు ధరలు పడిపోయినా.. వాటి ఫలాలు అందని సామాన్యులకు.. భారాన్ని మాత్రం ఇమ్మిడియట్ ఎఫెక్ట్ అన్న చందంగా వెనువెంటనే వడ్డించే పరిస్థితి.

అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పెట్రోల్.. డీజిల్ ధరల్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పదిహేను రోజుల క్రితమే లీటరు పెట్రోల్ మీద 83 పైసలు.. డీజిల్ మీద రూ.1.26 పెంచిన దానికి అదనంగా తాజాగా పెట్రోల్ మీద రూ.2.58.. డీజిల్ మీద లీటరుకు రూ.2.26 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఈ రోజు (జూన్ 1) నుంచి ఇప్పుడున్న పన్నులకు అదనంగా కేంద్రం స్పెషల్ గా కృషి సెస్ పేరిట 0.5శాతం పన్నును వడ్డించటంతో ఫోన్.. హోటల్.. ఇలా పలు సేవాబిల్లులపై అదనపు భారం పడనుంది. చూస్తుంటే అచ్చేదిన్ అన్నది ఎడారిలో ఓయాసిస్సు మాదిరి అయినట్లే.