Begin typing your search above and press return to search.

అప్ప‌ట్లో అమ్మ..చిన్న‌మ్మ‌లు అలా చేశార‌ట‌

By:  Tupaki Desk   |   28 May 2017 10:08 AM GMT
అప్ప‌ట్లో అమ్మ..చిన్న‌మ్మ‌లు అలా చేశార‌ట‌
X
సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది త‌మిళ‌నాడు. అనారోగ్యంతో అమ్మ జ‌య‌ల‌లిత ఆసుప‌త్రికి వెళ్లిన నాటి మొద‌లు త‌మిళ‌నాట సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాలు న‌మోద‌వుతూనే ఉన్నాయి. అమ్మ మ‌ర‌ణించి నెల‌లు గ‌డుస్తున్నా.. వివాదాలకు మాత్రం పుల్‌స్టాప్ ప‌డ‌టం లేదు. తాజాగా అమ్మ జ‌య‌ల‌లిత‌.. చిన్న‌మ్మ శ‌శిక‌ళ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసే ఉదంతం ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది.

ఈ మ‌ధ్య‌నే అమ్మ‌కు చెందిన కొడ‌నాడు ఎస్టేట్‌ లో భారీ చోరీ.. సెక్యూరిటీ గార్డు హ‌త్య‌లు పెను సంచ‌ల‌నాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇంత‌కాలం అమ్మ‌దిగా చెబుతున్న కొడ‌నాడు ఎస్టేట్‌.. అమ్మ వ‌శం ఎలా అయ్యిందో చెబుతున్న వివ‌రాలు ఇప్పుడు షాకింగ్‌ గా మారాయి. అమ్మ సొంతంగా చెబుతున్న కొడ‌నాడు ఎస్టేట్ ను దుర్మార్గంగా త‌న ద‌గ్గ‌ర నుంచి బ‌ల‌వంతంగా లాక్కున్నార‌ని.. ఇందులో అమ్మ జ‌య‌ల‌లిత‌.. ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ పాత్ర ఉన్న‌ట్లుగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు ఒక‌ప్ప‌టి ఆ ఎస్టేట్ అస‌లు య‌జ‌మాని పీట‌ర్ క‌ర్గ్ ఎడ్వార్డ్ క్రెగ్ జోన్స్‌.

ఒక‌ప్ప‌టి త‌న కొడ‌నాడు ఎస్టేట్ ను న్యాయ‌పోరాటం ద్వారా తిరిగి ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెబుతున్నారు. త‌న ద‌గ్గ‌ర నుంచి అన్యాయంగా ఎస్టేట్‌ ను జ‌య‌ల‌లిత‌..శ‌శిక‌ళ‌లు సొంతం చేసుకున్న‌ట్లుగా ఆయ‌న ఆరోపిస్తున్నారు. 1990 ప్రాంతంలో జ‌య‌ల‌లిత క‌న్ను త‌న ఎస్టేట్ మీద ప‌డింద‌ని.. దాన్ని త‌న‌కు అమ్మాలంటూ జ‌య‌ల‌లిత స‌న్నిహితులు.. స్నేహితులు.. శ‌శిక‌ళ‌.. అన్నాడీఎంకే నేత‌లు కొంద‌రు రెండు సంవ‌త్స‌రాల పాటు త‌మ మీద ఒత్తిడి తెచ్చార‌న్నారు. ఒక‌ద‌శ‌లో పెద్ద ఎత్తున గూండాల్ని తీసుకొచ్చి త‌మ‌ను బెదిరించిన‌ట్లుగా ఆయ‌న చెబుతున్నారు. కొడ‌నాడు ఎస్టేట్‌ను చాలా త‌క్కువ ధ‌ర‌కు అమ్మాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇష్టం లేకున్నా అమ్మాన‌ని.. త‌న‌కు రావాల్సిన మొత్తంలో కేవ‌లం రూ.7.5కోట్లు మాత్ర‌మే వ‌చ్చి మిగిలిన మొత్తాన్ని ఎగ్గొట్టార‌న్నారు. కొడ‌నాడు ఎస్టేట్‌ను అమ్మ ప‌రం చేయ‌టానికి కొద్దిమంది వ్యాపార‌వేత్త‌లు.. మంత్రులు.. అధికారులు కీల‌క‌భూమిక పోషించిన‌ట్లుగా చెప్పారు.

ఈ డీల్‌లో అమ్మ‌కు విధేయుడైన రాజాత్తిన‌మ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. ఎస్టేట్‌ను అమ్మ ప‌రం చేసే ప్ర‌య‌త్నం చేశార‌న్నారు. రిజిస్ట్రేష‌న్ చేయ‌టానికి రిజిష్ట‌ర్ ఆఫీసుకు కూడా వెళ్ల‌లేద‌ని.. ఎస్టేట్ కొనుగోలు వ్య‌వ‌హార‌మంతా బినామీ వ్య‌వ‌హారంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇంట్లో తాను.. త‌న తండ్రి భాగ‌స్వామ్య మార్పిడి ప‌త్రాల‌పై సంత‌కాలు చేశామ‌ని.. త‌ర్వాతి రోజే కొడ‌నాడు ఎస్టేట్ త‌మ నుంచి లాగేసుకున్నార‌న్నారు. త‌న మాదిరి న‌ష్ట‌పోయిన వారంద‌రినీ క‌లుపుకొని న్యాయ‌పోరాటాన్ని చేస్తాన‌ని.. త‌న నుంచి లాక్కున్న ఎస్టేట్‌ను సొంతం చేసుకుంటానిన చెబుతున్నారు పీట‌ర్‌. తాజా ఆరోప‌ణ‌లు మ‌రెన్ని కొత్త సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మ‌వుతాయో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/