Begin typing your search above and press return to search.

ఊరు.. ఊరే ఖాళీ చేసేశారు కేసీఆర్?

By:  Tupaki Desk   |   22 Feb 2017 4:20 AM GMT
ఊరు.. ఊరే ఖాళీ చేసేశారు కేసీఆర్?
X
అంతరిక్షంలోకి ఒక్క రాకెట్ లో 104 ఉపగ్రహాలు పంపిస్తున్నకాలం. అలాంటి రోజుల్లో మూఢనమ్మకాలతో.. తెలియని భయంతో ఒక ఊరు ప్రజలంతా కలిసి ఊరు మొత్తాన్ని ఖాళీ చేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదెక్కడో మారుమూల రాష్ట్రంలోనో.. పెద్దగా అభివృద్ధి లేని చోటో జరిగింది కాదు. దేశంలో సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో చోటు చేసుకోవటం గమనార్హం. దేశంలో అధిక రేటు వృద్ధి రేటుతో దూసుకెళుతున్న తెలంగాణలోనూ.. మంత్రి తుమ్మల లాంటి చురకత్తి లాంటి మంత్రి ఉన్న జిల్లాలో చోటుచేసుకున్న ఈ వైనం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఖమ్మం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఊళ్లో.. భయంతో ఊరు మొత్తం కలిని.. ఊరిని ఖాళీ చేసిన వైనం చూసినప్పుడు.. ప్రజలంత భయంతో వణికిపోయే పరిస్థితులు ఎందుకువచ్చాయి? అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ప్రజా ప్రతినిధులంతా ఏం చేస్తున్నారన్నది ప్రశ్నలుగా మారాయి. ఖమ్మంకు కూతవేటు దూరంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్దనున్న ఎదులాపురం గ్రామప్రజలకు గ్రామానికి కీడు వచ్చిందని.. ఊరును ఖాళీ చేసి.. అడవుల్లో తల దాచుకున్నారు. అలా కానీ చేస్తే.. ఊరికి పట్టిన కీడు తొలిగిపోతుందన్నది ప్రజల నమ్మకం.

ఎదులాపురం గ్రామంలో 200 వరకు కుటుంబాలు నివాసం ఉంటాయి. దాదాపు వెయ్యి మంది వరకూ జీవిస్తుంటారు. ప్రతి ఇంటికి తాళం వేసి ఉండటం.. పని దినమైనా స్కూలు నుంచి షాపుల వరకూ అన్ని బంద్ అయ్యాయి. మొత్తంగా చూస్తే.. ఊళ్లో ఎవరూ లేరు. అంతా కలిసి మూకుమ్మడిగా ఇళ్లకుతాళాలు వేసేసుకని.. గ్రామ పొలిమేరల్లో కంప చెట్ల మధ్య వంటలు చేస్తూ కనిపించారు.

ఎందుకిలా అంటే.. ఊరికి కీడు వచ్చిందని.. భయంతో బయటకు వచ్చామని చెబుతున్నారు. ఇంతకీ గ్రామస్తులు అంతగా భయపడుతున్న కీడు ఏమిటన్నది చూస్తే.. వరుసగా కొంతమంది మృత్యువాత పడ్డారు. వారంతా వివిధ కారణాలతో మృతి చెందారు. దీంతో.. ఆందోళన చెందిన గ్రామస్తులు.. ఒక సిద్ధాంతిని కలవగా.. గ్రామానికి కీడు పట్టిందని.. గ్రామస్తులంతా ఒక రోజు ఊరు విడిచి ఉండాలని చెప్పటంతో అడవి బాట పట్టారు. గ్రామంలో దండోరా వేయించి.. ఊరును ఖాళీ చేయాలని నిర్ణయించారు.

దీనికి మించిన మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తమ ఊరికి ఏదో కీడు పట్టిందని ఫీలైన ఎదులాపురం ప్రజల్ని.. పక్కనున్న గ్రామాల వారు సైతం తమ గ్రామాల్లోకి రానివ్వకపోవటం. దీంతో.. వారంతా గ్రామం బయటి అడువుల్లో ఉండాల్సి వచ్చింది. ఊరునుఖాళీ చేసే అంశంపైగడిచిన 15 రోజులుగా డప్పు కొట్టి మరీ ప్రచారం చేశారు. పోలీసులు.. ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు ఏమైనట్లు..? ఒక గ్రామానికి పీడ పడితే ఇలా చేశారనుకుందాం. రేపొద్దున ఒక జిల్లా మొత్తానికి పీడ పట్టిందన్న మూఢ నమ్మకం భారీగా ప్రబలితే ఏం చేస్తారు? ఇలాంటి వాటికి ప్రభుత్వం వెనువెంటనే స్పందించలేదు? పదిహేను రోజులుగా డప్పుకొట్టి ప్రచారం చేస్తున్నా.. ఎవరూ ఎందుకు స్పందించనట్లు..? గొప్ప గొప్ప మాటలు చెప్పే రాష్ట్ర ముఖ్యమంత్రి కసీఆర్ కు ఇలాంటి వాటిపై సమాచారం వెనువెంటనే ఎందుకు అందదు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/