Begin typing your search above and press return to search.

పెనమలూరు గ్రౌండ్ రిపోర్ట్: గెలుపెవరిది?

By:  Tupaki Desk   |   20 March 2019 7:22 AM GMT
పెనమలూరు గ్రౌండ్ రిపోర్ట్: గెలుపెవరిది?
X
అసెంబ్లీ నియోజకవర్గం : పెనమలూరు
టీడీపీ : బోడే ప్రసాద్ (సిట్టింగ్ ఎమ్మెల్యే)
వైసీపీ : కొలుసు పార్థసారథి
జనసేన : అభ్యర్థిని నిలుపలేదు..

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి రాజుకుంటోంది. కృష్ణా జిల్లా పెనమలూరు రాజకీయాలు ఎలా ఉన్నాయి.? విజయవాడకు సమీపంలోని ఈ నియోజకవర్గంపై పార్టీల ప్రభావం ఎలా ఉంది.? ఎన్నికల వేళ ఎలా ముందుకు వెళ్తున్నారు. నాయకుల బలాబలాలు ఏంటి? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. ఇక్కడ రాజకీయాలను చూస్తే టీడీపీ తిరిగి ఇక్కడ ఖాతా సొంతం చేసుకునే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈసారి పార్థసారథి లాంటి బలమైన నేత ఉండడంతో టఫ్ ఫైట్ కు దారితీస్తోందంటున్నారు. అధికార పార్టీ సంక్షేమ పథకాలతో ప్రజలకు రోజురోజుకి చేరువ అవుతోంది. మరోవైపు టీడీపీ ఐదేళ్ల పాలనపై వ్యతిరేకతనే వైసీపీ నమ్ముకుంది.

*పెనుమలూరు చరిత్ర
2009 పునర్విభజనలో పెనమలూరు నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పుడు వైఎస్ హయాంలో కీలకంగా ఉన్న కొలుసు పార్థసారథి కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు కొలుసు పార్థసారథి. అప్పటి ఎన్నికల్లో పెనమలూరు నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీ టికెట్ పొంది పోటీకి దిగారు. అయితే బలమైన కొనకళ్ల నారాయణ చేతిలో ఓడిపోయారు. దీంతో కొలుసు పార్థసారథి 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున తిరిగి పెనమలూరుకు మారారు. ఇక టీడీపీ తరుఫున 2014 ఎన్నికల్లో టికెట్ పొందిన బోడే ప్రసాద్ ఈజీగా గెలిచారు. అప్పుడు వైసీపీ పోటీ ఇవ్వలేకపోయింది. ఈ నాలుగేళ్లలో టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ సాగునీరు, చెరువుల అభివృద్ధి , గ్రామాల్లో అభివృద్ధి, రోడ్లు గాని ఇలా ప్రతి ఒక్కటి పూర్తి చేసి పెద్ద ఎత్తున ప్రజలకు చేరువయ్యాడు. ఈసారి బలమైన అభ్యర్థిగా బోడె ప్రసాద్ బరిలో ఉన్నారు. పార్థసారథి ఈయనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజా తీర్పు ఏంటనేది త్వరలోనే తేలనుంది.

*టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ కే ఎక్కువ చాన్స్
పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బోడే ప్రసాద్ పనితీరుపై నియోజకవర్గంలో సంతృప్తి నెలకొంది. ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక కార్యాలయం పెట్టి మరీ ప్రజల సమస్యలను నమోదు చేసుకోవడం.. వాటిని పరిష్కరిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. రైతుల విషయంలో అవసరమైతే అధికారులతో కూడా ఆయన యుద్ధం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. వారికి అవసరమైన కార్యక్రమాలు చేస్తూ వ్యవసాయానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఇదే ఆయనకు అదనపు బలం అని ఎమ్మెల్యేగా దగ్గరగా చూస్తున్న వారు ఘంఠా పథంగా చెబుతున్నారు.

*వైసీపీ అభ్యర్థి పార్థసారథికి కష్టమేనట..
విపక్ష వైసీపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న సీనియర్ పార్థసారథి ప్రభుత్వ వ్యతిరేకత.. జగన్ మేనియానే నమ్ముకున్నారు. ఈయన దూకుడు వ్యవహారశైలి మైనస్ గా మారింది. అధికార టీడీపీ ఎమ్మెల్యే దీన్నే అస్త్రంగా మలుచుకున్నారు. ఇక ప్రజలకు అందుబాటులో ఉండరనే పేరు పార్థసారథికి ఉంది. అయితే పదవి కోసం నియోజకవర్గాలు మారడం.. పోయిన సారి ఎంపీగా చేసి ఈసారి మళ్లీ పెనుమలూరు ఎమ్మెల్యేగా రావడంతో ఆయన ప్రజలకు చేరువ కాలేదు.

*జనసేన అభ్యర్థిని నిలుపలేదు
ఇక విజయవాడకు దగ్గర్లో ఉండడం.. టీడీపీ ప్రాబల్యం అధికంగా ఉండడంతో ఈ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని పవన్ నిలుపలేదు. అలాగని కమ్యూనిస్టులకు కూడా ఈ నియోజకవర్గంపై ఆసక్తి లేకపోవడంతో ప్రధానంగా టీడీపీ, వైసీపీ పోరే ఇక్కడ నెలకొంది.

*బోడే ప్రసాద్ కే చాన్స్
ప్రజలకు అందుబాటులో ఉండడం.. వారి సమస్యలు తీర్చే విషయంలో బోడే ప్రసాద్, పార్థసారథిలను పోల్చి చూస్తే బోడేకే ఎక్కువ మార్కులు పడతాయని స్థానికులు గ్రౌండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇదే టీడీపీ అభ్యర్థికి కొండంత బలంగా ఉంది. ఇక పెన్షన్లు రాని వారిని గుర్తించడం వారికి ఎమ్మెల్యే ఆఫీస్ ద్వారా సాయం చేయడం.. నమోదు చేయించడం.. ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులను అందించడం.. ఇలా ప్రతి ఒక్కటిని బోడె ముందుండి పేదలకు అందిస్తూ నియోజకవర్గంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే పార్థసారథి ఎంత గట్టి పోటీనిచ్చినా.. మరోసారి బోడేకే విజయం ఖాయమని గ్రౌండ్ రిపోర్టులో తేలింది.