Begin typing your search above and press return to search.

యురేనియంపై పోరు..పీకే ఫైరింగ్ రేంజి చూశారా?

By:  Tupaki Desk   |   17 Sep 2019 4:55 PM GMT
యురేనియంపై పోరు..పీకే ఫైరింగ్ రేంజి చూశారా?
X
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు ఓ వైపు రంగం సిద్ధం అవుతోంటే... దానిని నిలువరించేందుకు తెలుగు నేలకు ప్రత్యేకించి తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీలు సమర సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సమరానికి నాయకత్వం వహించేందుకు అన్నట్టుగా జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్లు ఇప్పుడు నిజంగానే పెద్ద చర్చకే తెర లేపాయి. యురేనియం తవ్వకాలను అడ్డుకుని తీరతామని ఇటు రాజకీయ పార్టీలు - ప్రజా సంఘాలు - మేధావులు చెబుతుంటే... యురేనియం తవ్వకాలతో నష్టపోయే గిరిజనుల పక్షాన నిలిచిన పవన్... వారి అస్తిత్వం, వారికి అందని హక్కులపై ప్రశ్నిస్తూ నిజంగానే ఈ విషయాన్ని ఓ పెద్ద చర్చనీయాంశంగా చేశారని చెప్పాలి.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమంపై చర్చించేందుకు జనసేన ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. జనసేన నేత - మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. సమావేశంలో పెద్దగా మాట్లాడని పవన్ ఆ తర్వాత ఇంటికెళ్లాక ట్విట్టర్ వేదికగా యురేనియం తవ్వకాలకు సంబంధించి ఆసక్తికర ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లలో ఆయన గిరిజనుల హక్కుల గురించి, రాజ్యాంగం గురించి తెలియకున్నా... దానిలోని నియమనిబంధనలను వారు ఎంత నిక్కచ్చిగా పాటిస్తారో కూడా వివరిస్తూ ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. అదే సమయంలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ కూడా ఆయన తనదైన శైలి .పోరాటాన్ని మొదలెట్టేశారని చెప్పక తప్పదు.

ఆ ట్వీట్టలో పవన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘ఆదివాసీలకు ప్రజాస్వామ్యం గురించి బోధించాల్సిన అవసరం లేదు. అంతేకాదు మీరు గిరిజనులకు ప్రజాస్వామ్యం గరించి బోధించలేరు. వారి నుంచి ప్రజాస్వామ్య విధానాలను నేర్చుకోవాలి. ఈ భూమ్మీద ప్రజాస్వామ్య విధానాలను పాటించే వారెవరైనా ఉన్నారంటే... అది గిరిజనులే’...‘పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నిర్దేశించిన ప్రకారం... మా ప్రజలకు ఎలాంటి రక్షణ చర్యలు అవసరం లేదు. మీ మినిస్టర్ల నుంచి మాత్రమే కేవలం రక్షణ కావాలి. మాకు ఎలాంటి ప్రత్యేకమైన ప్రొటెక్షన్ అవసరం లేదు. మమ్మల్ని భారతీయులుగా గుర్తించండి’అంటూ వరుస ట్వీట్లను సంధించిన పవన్.. యురేనియం తవ్వకాలపై తన భవిష్యత్తు పోరు ఎలా ఉంటుందో ఈ వ్యాఖ్యల ద్వారానే చెప్పినట్టైంది. ఇక గిరిజనుల వాయిస్ ను తన ట్వీట్లలో ప్రస్తావించిన పవన్... ఆ ట్వీట్లలో బీహార్ కు చెందిన జైపాల్ సింగ్ చెప్పిన విషయాన్ని పట్టించుకోవాలంటేూ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా... అఖిలపక్ష భేటీలో చెంచు నేత మల్లికార్జున్ చేసిన ఆవేదనాభరిత ప్రసంగానికి చెందిన వీడియోను కూడా పవన్ తన ట్వీట్లకు ట్యాగ్ చేశారు.