పవన్.. ఒక సామాన్యుడు

Sun Apr 15 2018 17:05:38 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వాన్ని అందుకుని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ చాలా వేగంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. పవర్ స్టార్ అయ్యాడు. చిరంజీవి తమ్ముడిగా వచ్చి చిరంజీవికి సమానమైన ఇమేజ్ సంపాదించడమంటే మాటలు కాదు. ఇందుకు పవన్ లోని విలక్షణతే ప్రధాన కారణం అని చెప్పాలి. చిరును ఎంత మాత్రం అనుకరించకుండా తనకంటూ ఒక స్టయిల్.. ఒక వ్యక్తిత్వం కూడా క్రియేట్ చేసుకుని మెగా అభిమానుల్నే కాక కొత్తగా తనకంటూ భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. పవన్ లోని విలక్షణత.. నిగూఢంగా ఉండే అతడి వ్యక్తిత్తమే అతడికి భారీ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. మామూలుగా తన గురించి. తన సినిమాల గురించి పవన్ ఎప్పుడూ పొగుడుకోవడం కనిపించదు. అదే సమయంలో తన కుటుంబ సభ్యుల గురించి కూడా పవన్ మాట్లాడటం తక్కువే. కానీ మొన్న ‘రంగస్థలం’ సక్సెస్ మీట్లో పవన్ వ్యాఖ్యలు చూసి అందరికీ మతిపోయింది. రామ్ చరణ్ ను.. ‘రంగస్థలం’ సినిమాను మామూలుగా పొగడలేదు పవన్. ఇప్పటిదాకా చిరంజీవిని సైతం పవన్ ఎప్పుడూ అంతగా పొగిడి ఉండడేమో. రామ్ చరణ్ మామూలోడు కాదని.. పరిపూర్ణ నటుడని.. ‘రంగస్థలం’ను ఆస్కార్ కు కూడా పంపించేయాలని.. అబ్బో ఇలా భారీ స్టేట్మెంట్లే ఇచ్చాడు పవన్. చరణ్ ను తమ్ముడిగా పేర్కొంటూ.. తన అన్నయ్య వదినల్ని తల్లిదండ్రులుగా చెబుతూ.. చరణ్ క్రమ శిక్షణ గురించి కూడా పొగడ్తలు గుప్పించేశాడు పవన్.ఎప్పుడూ వ్యక్తిగత విషయాల గురించి.. కుటుంబ సభ్యుల గురించి పొడి పొడిగా మాట్లాడే పవన్.. ఒక్కసారిగా ఇంత మార్పు చూపించేసరికి జనాలు ఆశ్చర్యపోయారు. ఈ ఫంక్షన్ మాత్రమే కాదు.. అంతకుముందు చరణ్ పుట్టిన రోజుకు చిరు కుటుంబాన్ని కలవడం.. అంతకుముందు ఓ రాజకీయ సభలో మాట్లాడుతూ.. తన అన్నయ్యను మోసం చేసిన వాళ్ల సంగతి చూస్తానని.. వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడానికే జనసేన పార్టీ పెట్టానన్నట్లుగా మాట్లాడటం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఇవన్నీ పవన్ మీద ఇంతకుముందున్న అభిప్రాయాల్ని మార్చేస్తున్నాయి. పవన్ జనసేన పార్టీ పెట్టడానికి కొంత కాలం ముందు నుంచి అన్నయ్య చిరుకు చాలా దూరంగా ఉంటూ వచ్చాడు. రాజకీయాల విషయంలో చిరు చేసింది నచ్చకే పవన్ అలా వ్యవహరిస్తున్నాడని అంతా అన్నారు. పార్టీని అమ్మేయడం కూడా పవన్ కు చాలా కోపం తెప్పించిందన్న భావన జనాలకు కలిగింది. ఆ క్రమంలోనే జనసేన పార్టీ పెడితే చిరుకు భిన్నంగా రాజకీయాలు చేస్తాడని అంతా అనుకున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీకి దూరం దూరం జరగడంతో ప్రజా ప్రయోజనాల కోసం కుటుంబాన్ని కూడా దూరం పెడతాడన్న భావన కూడా చాలామందికి కలిగింది. అప్పుడు అతడిలో ఒక నిజాయితీ.. నిబద్ధత కనిపించింది. న్యూట్రల్ గా ఉన్నవాళ్లు పవన్ పట్ల ఆకర్షితులు కావడానికి.. చిరును వ్యతిరేకించేవాళ్లు సైతం అతడిని అభిమానించడానికి పవన్ వ్యక్తిత్వం కారణమైంది.

కానీ గత కొన్ని నెలల్లో పరిణామాలు చూస్తే ఈ అభిప్రాయాలన్నీ తప్పన్న భావన కలుగుతోంది. ప్రజారాజ్యం పార్టీ వైఫల్యంలో చిరంజీవి పాత్రే లేదన్నట్లుగా పవన్ మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. అందరూ కలిసి చిరును మోసం చేశాడన్నట్లుగా ఉంది పవన్  తీరు. ఇక గత కొంత కాలంగా అన్నయ్య కుటుంబంతో చాలా సన్నిహితంగా మెలగడమే కాదు.. మొన్నటి ‘రంగస్థలం’ వేడుకలో చేసిన ప్రసంగం చూస్తే ఇన్నాళ్లూ పవన్ లో చూసిన విలక్షణత మొత్తం పోయినట్లు కనిపించింది. అవ్వడానికి ఇది సినిమా వేడుకే కావచ్చు.. కానీ పవన్ ను ఒక రాజకీయ నాయకుడిగా చూసే వాళ్లకు కూడా అతడిపై అభిప్రాయాలు మారిపోయాయి. చరణ్ ను అలా పొగడ్డం చూస్తే పవన్ కూడా అందరిలాంటి వాడే అని.. అతడిలో ఏ వైవిధ్యం.. విలక్షణత లేవన్న అభిప్రాయాలు కలిగాయి. మొత్తానికి పవన్ ఇన్నాళ్లూ ఒక ముసుగు కప్పుకుని తిరిగి.. ఇప్పుడు ఆ ముసుగు తీసేసి తాను కూడా ఒక మామూలు వ్యక్తినే అని.. తన నుంచి ప్రత్యేకంగా ఏమీ ఆశించవద్దని గత కొన్ని రోజుల పరిణామాలతో రుజువు చేసినట్లయింది.