Begin typing your search above and press return to search.

పవన్ ది కన్ఫ్యూజనా? కంటితుడుపా?

By:  Tupaki Desk   |   27 Oct 2016 12:15 PM GMT
పవన్ ది కన్ఫ్యూజనా? కంటితుడుపా?
X
సినీ హీరోలంటే జనంలో క్రేజ్ మామూలుగా ఉండదు.. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ ఊపే వేరు. కానీ, మిగతా హీరోల్లా పవన్ ఆడియో ఫంక్షన్లు వంటి భారీగా నిర్వహించడం చాలా తక్కువ. అందుకు కారణమేంటో కూడా పవన్ పలుమార్లు వెల్లడించారు. తనసినిమా ఫంక్షన్ కోసం, తనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తే తొక్కిసలాటలు అవుతాయని.. వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదాలు వంటివి జరుగుతాయని.. తన కోసం అభిమానులు ప్రమాదాలకు గురవడం ఇష్టం లేకనే తాను అలాంటివాటికి దూరంగా ఉంటానని చెబుతారు. అభిమానులు సినిమాహాలు వరకు వస్తే చాలని - తనకోసం రావొద్దని - ఉద్రేక పడొద్దని - ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని కూడా చెబుతుంటారు.

అయితే.. పవన్ ఇప్పుడు కేవలం సినీ నటుడు కాదు - రాజకీయనేత కూడా. అందుకే ప్రజా సమస్యల కోసం జనంలోకి రావడం, సభలు పెట్టడం తప్పడం లేదని అంటున్నారు. తన సభలకు వచ్చేవారు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. నెల రోజుల కిందట పవన్ కాకినాడలో నిర్వహించిన సభకు వచ్చిన యువకుడు తొక్కిసలాటలో చనిపోయిన నేపథ్యంలో అప్పట్లో పవన్ .. బహిరంగ సభలకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ఆలోచిస్తున్నానని కూడా చెప్పారు. కానీ.. అదే పవన్ ఇప్పుడు మరో భారీ బహిరంగసభకు సిద్ధమవుతున్నారు. అనంతపురంలో జనసేన సభకు సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కాకినాడ సభ సందర్భంగా వెంకటరమణ అనే 22 ఏళ్ల కుర్రాడు మరణించాడు. ఆ తరువాత రోజున మీడియాతో మాట్లాడిన పవన్.. తన అభిమాని మరణం తనను కలచివేసిందని... రాత్రంతా నిద్రపట్టలేదని చెప్పారు. అంతేకాదు... తమ పిల్లల గురించి ఆందోళన చెందే తల్లిదండ్రులు వారిని తన సభలకు పంపించవద్దని చెప్పారు. వచ్చేవారుకూడా తగినజాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తన మీటింగు కంటే వారి భద్రతే ముఖ్యమని చెప్పిన పవన్ ప్రమాదాలకు ఆస్కారమిచ్చే బహిరంగ సభలకు ప్రత్యామ్నాయం వెతుకుతున్నానన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ సభకు రెడీ అంటుండడంతో పవన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారా లేదంటే అభిమాని మరణంపై ఆయన ఆవేదన కంటితుడుపేనా అన్న విమర్శలు వస్తున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/