Begin typing your search above and press return to search.

బాబు - పవన్.. ఒకే అస్త్రం - వర్కవుట్ అవుతుందా?

By:  Tupaki Desk   |   23 March 2019 9:03 AM GMT
బాబు - పవన్.. ఒకే అస్త్రం - వర్కవుట్ అవుతుందా?
X
అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఒకే వ్యూహంతో కనిపిస్తూ ఉన్నారు. ఏపీ ప్రజల్లో సెంటిమెంట్ ను రేకెత్తించే అస్త్రాన్నివీరు నమ్ముకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పోలింగ్ కు మరో మూడు వారాల సమయం కూడా సరిగా లేని నేపథ్యంలో.. ఈ ఇద్దరు నేతలనూ ప్రజల్లో సీమాంధ్ర భావోద్వేగాలు రెచ్చగొట్టే పనిలో ఉన్నారని స్పష్టం అవుతోంది. ప్రత్యేకించి కేసీఆర్ పేరు చెప్పి వీరిరువురూ రాజకీయం చేస్తూ ఉండటం విశేషం.

కేసీఆర్ చేతిలో హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రజలు హింసించబడుతున్నారని - హైదరాబాద్ లో ఏపీ ప్రజలపై దాడులు జరుగుతూ ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పాడు. ఇక చంద్రబాబు నాయుడు అయితే సరే సరి. ఈ ఎన్నికలు తనకూ కేసీఆర్ కు మధ్య అని అంటున్నారాయన. జగన్ గెలిస్తే.. సీమాంధ్రను సామంత రాజ్యంగా చేస్తారని, జగన్ గెలిస్తే సీమాంధ్రలో కేసీఆర్ మాట చెల్లుబాటు అవుతుందని.. ఇలాంటి మాటలతో బాబు ప్రజలను బెదరగొట్టే ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు.

ఇప్పటికే కేసీఆర్ ను బూచిగా చూపడాన్ని చంద్రబాబు మొదలుపెట్టి చాలా కాలం అవుతూ ఉంది. డేటా థెప్ట్ ఉదంతంలో కూడా కేసీఆర్ పేరును పదే పదే తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ పేరు చంద్రబాబు నాయుడుకు అస్త్రంగా మారింది. మొదట్లో మోడీని కూడా బాబు బూచిగా చూపించే వారు. అయితే మోడీ మీద వ్యతిరేకత లేదని తెలుసుకున్నట్టున్నారు. ఇప్పుడు మోడీని వదిలి కేసీఆర్ పేరును పట్టుకుని సాగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు.

ఇక తనదే ఇదే వ్యూహం అన్నట్టుగా పవన్ కల్యాణ్ మరింత ముందుకు వచ్చేశాడు. ఏకంగా హైదరాబాద్ లో సీమాంధ్రుల మీద దాడులు జరుగుతున్నాయని, అక్కడ జనాలను కొడుతున్నారని.. ఇలా మాట్లాడుతున్నాడు పవన్ కల్యాణ్.

ఇలా ఈ ఇద్దరు నేతలూ సీమాంధ్ర పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్నికల్లో కేసీఆర్ పేరే వీరి అస్త్రంగా మారింది. అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన మరో అంశం కూడా ఉంది. అదేమిటంటే.. చంద్రబాబు నాయుడు మొన్నటి వరకూ కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు నెరిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు అయితే.. కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని బాబు ప్రయత్నించారు. ఆ విషయాన్ని తనే చెప్పారు కూడా. తను పొత్తు ప్రతిపాదన చేస్తే కేసీఆర్ వద్దన్నాడని బాబు వాపోయారప్పుడు.

ఇక పవన్ కల్యాణ్ కూడా.. కేసీఆర్ పాలన బావుందని ఇది వరకూ ప్రశంసించారు. అయితే ఏపీ ఎన్నికల సమయానికి మాత్రం వీరిద్దరూ మాట మార్చారు. కేసీఆర్ ను బూచిగా చూపి సీమాంధ్రలో సెంటిమెంట్ క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు.

అయితే వీళ్లిద్దరిదీ నిఖార్సైన వ్యూహమేనా? సీమాంధ్ర జనాల్లో కేసీఆర్ మీద అంత ధ్వేషం ఉందా? మొన్నటి వరకూ కేసీఆర్ తో ఫ్రెండ్షిప్ కోసం ట్రై చేసిన చంద్రబాబు - సామాన్యులెవరి మీదా దాడులు జరగకపోయినా జరిగాయంటున్న పవన్ కల్యాణ్ ల మాటలు.. ఏపీ ఎన్నికల్లో ఏ మేరకు ఓట్లను రాలుస్తాయో ఫలితాలు వస్తే కానీ తెలియదు!