Begin typing your search above and press return to search.

పవన్ ప్రసంగాలు..జనసేన ఊపును తగ్గించేస్తున్నాయా?

By:  Tupaki Desk   |   15 March 2019 5:12 AM GMT
పవన్ ప్రసంగాలు..జనసేన ఊపును తగ్గించేస్తున్నాయా?
X
తన ప్రసంగాలతో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పదే పదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటున్న వైనం కనిపిస్తోంది. ఇది వరకూ కూడా పలు సార్లు పవన్ కల్యాణ్ టార్గెట్ జగన్ అన్నట్టుగానే ప్రసంగించారు. ఏదో ఒకటీ రెండు సందర్భాల్లో మాత్రమే చంద్రబాబును - లోకేష్ ను విమర్శించారు పవన్ కల్యాణ్. అయితే ఆ తర్వాత పవన్ రూటు మారింది. కేవలం జగన్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకొంటూ ఉన్నారు.

ఆఖరికి పవన్ ప్రసంగాలు వింటే.. అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీనా లేక జగన్ మోహన్ రెడ్డినా? అనే సందేహాలు కూడా కలిగే అవకాశం ఉంది. ప్రతిదానికి జగన్ మీద ఏదో ఒక విధంగా నోరు పారేసుకోంది పవన్ కల్యాణ్ పొద్దు గడిచేలా లేదనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆఖరికి కడప ఎంపీ సీటును బీసీలకు ఎందుకు కేటాయించలేదు అని ప్రశ్నించేశారు పవన్ కల్యాణ్. అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వవిషయం.

ఇదే ప్రశ్నను పవన్ కల్యాణ్ ను అడిగిలే ఎలా ఉంటుంది? నెల్లూరు రూరల్ సీటును మీరెందుకు రెడ్డికి కేటాయించారు? అక్కడ బీసీలున్నారు కదా.. వారికి ఎందుకు ఇవ్వలేదు? అంటే దానికి జనసేన సమాధానం ఇవ్వగలదా? ఏ పార్టీ అయినా తన సామాజికవర్గం సమీకరణాల ఆధారంగా సీట్లను కేటాయించుకుంటుంది. ఆ విషయాన్ని ప్రజలు చూసుకుంటారు. కుల సంఘాలు స్పందించుకుంటాయి. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఏదో కుల సంఘం నేత తీరున మాట్లాడుతూ ఉన్నారు. తన బొక్కలు పక్కన పెట్టి, చంద్రబాబును పల్లెత్తు మాట అనకుండా.. అన్నింటా జగన్ ను విమర్శిస్తూ సాగుతున్నారు పవన్ కల్యాణ్. నిఖార్సైన పవన్ కల్యాణ్ –జనసేన అభిమానులకు కూడా ఇది నచ్చడం లేదు. ఎందుకంటే.. వారు ముక్కోణపు పోరు కోరుకుంటున్నారు. ఆ పోరులో పవన్ నెగ్గాలని అనుకుంటున్నారు. అయితే.. పవన్ మాత్రం.. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.

జగన్ ను ప్రశ్నించిన పవన్ అదే నోటితోనే చంద్రబాబును కూడా కడిగేస్తే జనసేనలో వచ్చే మజానే వేరు. అది గత ఆవిర్భావ సమయంలోనే కనిపించింది .ఈ సారి ఆవిర్భావ సభ సమయానికి పవన్ మళ్లీ చంద్రబాబు దండకం అందుకుంటున్నట్టుగా… కేవలం జగన్ ను లక్ష్యంగా చేసుకోవడం మాత్రం రాజకీయంగా కూడా అంత మెరుగైన వ్యూహం కాదని పరిశీలకులు అంటున్నారు.

తను తృతీయ ప్రత్యామ్నాయం కావాలని అనుకుంటున్నట్టు అయితే.. పవన్ మాట్లాడాల్సింది ఇలా కాదని చెబుతున్నారు. ఇలా మాట్లాడితే.. కేవలం చంద్రబాబు చేతిలో మనిషిగా పవన్ విషయంలో జనాలు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.