Begin typing your search above and press return to search.

అవినీతిలో నీతి గురించి చెప్పిన ప‌వ‌న్!

By:  Tupaki Desk   |   21 May 2018 5:05 AM GMT
అవినీతిలో నీతి గురించి చెప్పిన ప‌వ‌న్!
X
నేను ఓట్లు అడ‌గ‌టానికి రాలేదు. హామీలు ఇవ్వ‌టానికి రాలేదంటూ చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. త‌న మాట‌ల‌కు.. చేత‌ల‌కు పొంత‌న ఉండ‌ద‌న్న విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేశారు. తాజాగా ఆయ‌న శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురంలో పోరుయాత్ర‌ను ఆయ‌న‌కు షురూ చేశారు. ఈ సంద‌ర్భంగా భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసి ప్ర‌సంగించారు.

ఈ స‌భ‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. తాను హామీలు ఇచ్చేందుకు రాలేదని.. ప్ర‌జ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌లపై అవ‌గాహ‌న కోసం వ‌చ్చిన‌ట్లుగా వెల్ల‌డించారు. ఓవైపు అలా చెప్పిన ప‌వ‌న్ మ‌రోవైపు మాత్రం తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే చేస్తానంటూ ప్ర‌యారిటీ లిస్టును చెప్ప‌టం గ‌మ‌నార్హం. త‌న జీవితం చాలా చిన్న‌ద‌ని.. తాను అంద‌రిలానే బ‌తుకుతాన‌న్నారు. డ‌బ్బు అవ‌స‌రం కూడా త‌న‌కు లేద‌న్న ఆయ‌న‌.. హెరిటేజ్ ను పెంచ‌టం కోసం ఒక‌ప్పుడు విజ‌య‌డైరీని నాశ‌నం చేశార‌ని.. తాను మాత్రం అలా కాద‌న్నారు. ప్ర‌భుత్వ సంస్థ‌లు బ‌త‌కాల‌ని తాను కోరుకుంటాన‌ని.. అలా ఆలోచించే వారిలో తాను ముందు ఉంటాన‌న్నారు.

త‌న‌కు అవినీతి ర‌హిత స‌మాజం గురించి తెలీద‌ని.. అవినీతిలోనూ నీతి ఉండాల‌ని తాను కోరుకుంటాన‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అగ్రిగోల్డ్ లెక్క‌లు తేలుస్తాన‌న్న ప‌వ‌న్‌.. అప్పుల చిట్టా ప్ర‌జ‌ల ముందు పెడ‌తాం.. ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తీసుకొని ఓటింగ్ పెట్టి రిఫ‌రెండం స్వీక‌రిస్తామ‌న్నారు.

అనంత‌రం అగ్రిగోల్డ్ బాధితుల‌కు ఆస్తులు పంచుతామ‌న్నారు. టీడీపీ నేత‌ల మాదిరి వాటాలు పంచుకునే ప‌నులు మాత్రం చేయ‌మ‌న్నారు. నిజాయితీగా ప‌ని చేస్తూ .. క‌ష్టాల్లో ఉండే వారికి అండ‌గా నిల‌బ‌డే పార్టీ త‌మ‌ద‌న్నారు. డ‌బ్బుతో ఓట్లు కొనే తీరుకు చ‌ర‌మ‌గీతం పాడాల‌న్న ఆయ‌న‌.. గంగ‌వ‌రం పోర్టు కాలుష్యం విష‌యంలో ఒక మ‌హిళ త‌న‌ను నిందించింద‌ని.. అయిన‌ప్ప‌టికీ ప‌ర్లేద‌న్నారు.

ఎవ‌రెవ‌రో చేసిన ద్రోహానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను నిందించొచ్చ‌న్న ఆయ‌న‌.. ఎందుకంటే నేను అంద‌రివాడిని.. నేనే సీఎం అయితే గంగ‌వ‌రం పోర్టు యాజ‌మ‌న్యాన్ని పిలిచి బాధితుల స‌మ‌స్య‌ల్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసే వాడిని. కానీ.. ఇలాంటివేమీ సీఎం చంద్ర‌బాబుకు ప‌ట్ట‌డం లేదంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఖ‌జానా వారి చేతిలో ఉంది.. తాళాలు వారి చేతుల్లోనే ఉన్నాయి. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా చేసుకోనివ్వండంటూ విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించారు. ఓట్లు అడ‌గ‌నంటూనే.. అడిగేస్తున్న ప‌వ‌న్ రానున్న రోజుల్లో త‌న ప్ర‌చారంలో మ‌రెన్ని వైరుధ్యాలు ప్ర‌ద‌ర్శిస్తారో చూడాలి.