లాంచీలోని వాళ్లని ప్రభుత్వమే చంపినట్టు- పవన్

Wed May 16 2018 15:39:21 GMT+0530 (IST)

కొండమొదలు నుంచి రాజమండ్రి వెళుతున్న ఓ ప్రైవేటు లాంచీ దేవీ పట్నం మండలం మంటూరు దగ్గర నీట మునిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పెళ్లి బృందంతో సహా దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న లాంచీ ...ఈదురుగాలుల ప్రభావానికి లోనై బోల్తా పడడంతో 40 మందికి పైగా గల్లంతైన ఘటన పెను విషాదం మిగిల్చింది. 60 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్లు....అందులో మిగిలిన వారి మృతదేహాలున్నట్లు రెస్క్యూ టీం భావిస్తోంది. ఆ లాంచీని బయటకు తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ హృదయవిదారక ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ ఘటన గురించి వినగానే తన హృదయం బాధతో బరువెక్కిందని పవన్ అన్నారు. కూలీనాలీ చేసుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైన గిరిజనులు దుర్మరణం చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ చెప్పారు. ఆ ఘటన బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పవన్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.60 అడుగుల లోతులో లాంచీ పడిపోయిందంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమైందని పవన్ అన్నారు. మృతుల కుటుంబాలకు తన తరఫున - జనసేన తరఫున ప్రగాఢ సానుభూతిని పవన్ తెలియజేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని పవన్ మండిపడ్డారు. సర్కార్ వైఫల్యం గిరిజనుల పాలిట శాపం కాకూడదని పవన్ అన్నారు. ప్రభుత్వ శాఖలు - ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ తరహా ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లాంచీకి అనుమతులు సరిగా లేకపోవడం అధికారుల - ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. ఈ తరహా దుర్ఘటనలు జరిగిన కొద్దిసేపు హడావిడి చేసే ప్రభుత్వం....ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించాలని పవన్ అన్నారు.

ప్రజల వద్దకు పాలన అనేది కేవలం ప్రకటనలకే పరిమితమైందని పవన్ విమర్శించారు. నిత్యావసరాలు - వైద్యం - విద్య ...ఇలా ప్రతి చిన్న పనికి నదిలోనే ప్రమాదకర రీతిలో గిరిజనులు ప్రయాణిస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని అన్నారు. గిరిజన గూడేలపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం తరఫున రావాల్సిన పరిహారం ఇప్పటికీ అందలేదని వాటి విషయంలో అధికారుల చుట్టూ నిర్వాసితులు ప్రదక్షిణాలు చేస్తోన్న పరిస్థితి ఉందని పవన్ అన్నారు. అధికారులను కలిసి వెళుతోన్న వారు కూడా జలసమాధి కావడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నడుం బిగించాలని కోరారు. నదుల్లో అనుమతులు లేని బోట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో బోటు ప్రమాద ఘటన మరవక ముందే మరో దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు.