పవన్ బస్సు యాత్ర సీక్రెట్.. బయటపడింది..

Thu May 17 2018 12:52:45 GMT+0530 (IST)

జనసేనాని పవన్ కళ్యాన్ సీక్రెట్ గా విశాఖ నగరం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బుధవారం రాత్రి ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా విశాఖ రామా టాకీస్ దగ్గర అంబేద్కర్ భవన్ కు పవన్ చేరుకున్నాడు. రాత్రి అక్కడే బస చేశాడు. అయితే పవన్ తాను తలపెట్టిన బస్సుయాత్రను మొదలుపెట్టడానికే విశాఖకు వచ్చినట్టు సమాచారం. విశాఖ నుంచే బస్సుయాత్ర ప్రకటన చేయడానికి రెడీ అయినట్టు తెలిసింది.  పవన్ తన బస్సుయాత్రను వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి చేపట్టనున్నట్లు గతంలో ప్రకటించారు. అందులో భాగంగా విశాఖకు వచ్చినట్టు తెలిసింది. గురువారం నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తారా లేదా శుక్రవారం నుంచా అన్నది తేలాల్సి ఉంది.

అయితే పవన్ కళ్యాన్ వచ్చేది ఎవ్వరికీ తెలియకుండా గోప్యంగా ఉంచడం సంచలనమైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి రూమ్ బుక్ చేసుకున్న పవన్.. సాయంత్రం నాలుగు గంటలకు జనసేన నాయకులకు తాను విశాఖ వస్తున్నట్టు చెప్పినట్టు తెలిసింది. చివరకు రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు పవన్ చేరుకున్నారు. అక్కడికి రాగానే పవన్ కళ్యాణ్ అంబేద్కర్ భవన్ కు వెళ్లి రాజ్యాంగనిర్మాతకు నివాళులర్పించారు.

అనంతరం తాను బస చేసిన హోటల్ నుంచి బయటకు వచ్చిన పవన్ కార్యకర్తలతో రెండు నిమిషాలు సమావేశమయ్యారు. బస్సుయాత్రపై చర్చించారు. నిన్ననే మూడు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకొని వచ్చిన పవన్ ఈరోజు విశాఖలో ప్రత్యక్ష్యమవడం విశేషం.