Begin typing your search above and press return to search.

పవన్ మాస్టర్ ప్లాన్..వర్కవుట్ అవుతుందా.?

By:  Tupaki Desk   |   21 May 2018 4:25 AM GMT
పవన్ మాస్టర్ ప్లాన్..వర్కవుట్ అవుతుందా.?
X
అలా ఇలా కాదు.. ఏకంగా ఒకటే దెబ్బకు సీఎం.. పవన్ కళ్యాన్ ఏపీ రాజకీయాలను ఎన్టీఆర్ లాగా కొన్ని నెలల్లోనే చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. పవన్ కల్యాణ్ పోరుయాత్రలో భాగంగా ఇచ్చాపురంలో ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.. గడిచిన 4 ఏళ్లుగా సినిమాలు తీస్తూ అంతో ఇంతో సంపాదించిన పవన్ కళ్యాణ్ ఆ డబ్బులతో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో దూసుకువచ్చారు. ప్రత్యేకహోదాను బూచీగా చూపి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నారు.. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? బలమైన చంద్రబాబు - జగన్ లను మించి పవన్ అధికారం చేపడతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న..

*కేసీఆర్ కాపీ..

ఏపీలో ఇప్పుడు సాధించడానికి ఉన్న ఏకైక ఆయుధం ‘ప్రత్యేకహోదా’.. దీన్నే పవన్ కళ్యాణ్ తన ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారు. ఇందుకోసమే పోరాడుతానని ప్రకటించారు. అందులో భాగంగా ఎన్నికలకు ముందు హోదాపై ఆమరణ దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. కానీ అది అనుకున్నంత మైలేజ్ తీసుకొస్తుందా లేదా అన్నది సందిగ్ధమే.. కేసీఆర్ తెలంగాణ కోసం 2001 నుంచి పోరాడుతున్నారు. ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్నారు. సొంతంగా పార్టీని నిర్మించారు. అప్పుడు గ్రామ స్థాయి నుంచి టీఆర్ ఎస్ కు సంస్థాగత బలం ఉంది.. అందుకే తెలంగాణ ఉద్యమం గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు ఉవ్వెత్తున సాగింది. ఇప్పుడు కేసీఆర్ ను కాపీ కొట్టాలనుకుంటున్న పవన్ కు ప్రజల్లో కానీ.. క్షేత్రస్థాయి నుంచి కానీ బలం లేకపోవడం ప్రధాన లోపం.. కేవలం ఫ్యాన్స్ పరంగా ఉన్న సపోర్ట్ తప్పితే పవన్ కు ప్రజల్లో అంతగా బలం లేదని తెలుస్తోంది.

*బలం - బలగం లేదు మహాశయా..

ఒకపార్టీని స్థాపించడం తేలికే.. కానీ దాన్ని విస్తరించడం చాలా కష్టం.. అదే ఇప్పుడు పవన్ ముందున్న సవాల్.. హోదాపై ఆమరణ దీక్ష ప్రకటనకు దిగుతానని ప్రకటించిన పవన్ కు ప్రజల్లో రెస్పాన్స్ వస్తుందా లేదా అన్నది కీలకం.. కేసీఆర్ ఆమరణ దీక్ష తర్వాత తెలంగాణ సమాజం ఒక్కటైంది. ఊరు వాడా కదిలి వచ్చింది. ముఖ్యంగా విద్యార్థులు రాష్ట్రం కోసం పోరుబాటుకు సిద్ధమయ్యారు. మరి ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కు ఫ్యాన్స్ కదిలివచ్చినా ప్రజలు - విద్యార్థులు ప్రభావితం అవుతారా లేదా అన్నదే ప్రశ్న.. మరి ఏడాదిలోనే సీఎం అవ్వడానికి పవన్ చేస్తున్న ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే..