Begin typing your search above and press return to search.

ఏపీ అయిపోయిందా ప‌వ‌న్‌?ఇక‌..తెలంగాణ‌లోనా?

By:  Tupaki Desk   |   21 Jan 2018 4:45 AM GMT
ఏపీ అయిపోయిందా ప‌వ‌న్‌?ఇక‌..తెలంగాణ‌లోనా?
X
రాజ‌కీయం వ్యూహాత్మ‌కంగా ఉండాలి. ప్లానింగ్ విష‌యంలో ఏ మాత్రం త‌ప్పు జ‌రిగినా అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అందుకే.. రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు.. అన్నీ ఆత్మ‌హ‌త్య‌లేన‌ని ఊరికే అన‌లేదేమో. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు చూస్తే.. గంద‌ర‌గోళానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంటారు.

కాసేపు ప్ర‌జ‌లంటారు.. మ‌రికాసేపు పార్టీ అంటారు. ఇలా తానేం చేయాల‌నుకుంటున్నాన‌న్న విష‌యంపై ప‌వ‌న్ ఎప్పుడూ క్లారిటీగా చెప్పింది లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి రాజ‌కీయాలు చేయ‌లేని ప‌రిస్థితి. ఏదో ఒక రాష్ట్రం మీద‌న మాత్ర‌మే మాట్లాడే ప‌రిస్థితి.

రెండు రాష్ట్రాల్లో నెల‌కొన్న ప‌రిస్థితులు కానీ.. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఏదైనా ఇష్యూ వ‌స్తే.. రెండు రాష్ట్రాల్లోని తెలుగు వారు త‌మ ప్ర‌యోజ‌నాల గురించి మాట్లాడాల‌నుకుంటున్నారే కానీ.. న్యాయం మీద నిల‌బ‌డాల‌ని అనుకోని ప‌రిస్థితి. ఎందుకంటే.. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి త‌మ ప్ర‌యోజ‌నాలు ముఖ్య‌మే త‌ప్పించి.. ప‌క్క రాష్ట్రం కోసం త్యాగాలు చేసే ప‌రిస్థితి లేదు. ఇలాంటి వేళ‌.. రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు చేయ‌టం అంత సులువు కాదు.

కానీ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయం చేస్తాన‌ని చెబుతున్నారు. గ‌డిచిన కొంత కాలంగా ఏపీ మీద దృష్టి పెట్టిన ప‌వ‌న్‌.. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల మీద ఫోక‌స్ చేస్తాన‌ని వెల్ల‌డించారు. త్వ‌ర‌లో తాను తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఇందుకోసం త‌న‌కు ప్రాణ‌దానం చేసిన కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి దేవాల‌యం నుంచి త‌న ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభించనున్న‌ట్లుగా చెప్పారు. ఏదైనా రాష్ట్రంలో ప‌ర్య‌ట‌న చేసే ముందు.. టూర్ ల‌క్ష్య‌మేమిట‌న్న‌ది చెప్పటం క‌నిపిస్తుంది. కానీ.. ప‌వ‌న్ విష‌యంలో అలాంటివేమీ క‌నిపించ‌దు. ఆ మ‌ధ్య‌లో ఏపీలో హ‌డావుడి చేసిన ప‌వ‌న్.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ విష‌యం మీద మాట్లాడింది లేదు. విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ కానీ.. మెడిక‌ల్ విద్యార్థుల అంశం కావొచ్చు.. వాటి మీద తాను పోరాటం చేస్తాన‌ని.. వెన‌క్కి త‌గ్గ‌న‌ని స్ప‌ష్టం చేసిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఈ రెండు విష‌యాల్లో శాశ్విత ప‌రిష్కారం ఇంకా ల‌భించ‌లేదు. వాటి మీద పోరాటాన్ని వ‌దిలేసి.. తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న ముచ్చ‌ట‌ను చెప్ప‌టం చూస్తే.. ప‌వ‌న్ ఏం చేయాల‌నుకున్నార‌న్న దానిపై కొత్త సందేహాలు క‌ల‌గ‌టం ఖాయం. అధికార‌ప‌క్షానికి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌నే భావ‌న ప‌వ‌న్ లో క‌నిపించ‌దు. ఆ మాట‌కు వ‌స్తే.. అధికార‌మే ల‌క్ష్యంగా త‌న రాజ‌కీయ వ్యూహాలు ఉండ‌వ‌ని.. ఆ మాట‌కు వ‌స్తే.. తాను ముఖ్య‌మంత్రి కావాల‌ని అనుకోవ‌టం లేద‌న్న మాట‌ను ప‌వ‌న్ చెబుతుంటారు.

ఇలా.. ప‌వ‌న్ ప్ర‌తి అడుగులోనూ క‌న్ఫ్యూజ‌న్ కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంటుంది. చేసే ప‌ని మీద క్లారిటీ కంటే కూడా తాను చెప్పే దానికి.. చేసే దానికి సంబంధం లేని రీతిలో వ్య‌వ‌హ‌రించే ప‌వ‌న్ తెలంగాణ పర్య‌ట‌న ప్ర‌క‌ట‌న చూసినంత‌నే అనిపించేది ఒక్క‌టే.. ఏపీలో ఏం పీకార‌ని.. ఇప్పుడు తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌టమ‌ని? వేసే ప్ర‌తి అడుగులోనూ ఎంతోకొంత మైలేజీని మూట‌గ‌ట్టుకోవ‌టం.. చిన్న చిన్న విజ‌యాల‌తో పెద్ద విజ‌యాన్ని సాధించే స‌త్తా ఉంద‌న్న సందేశాన్ని ఇవ్వ‌టం వ‌దిలేసి.. ఒకే స‌మ‌యంలో రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణాన్ని ప‌వ‌న్ న‌మ్ముకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వ్యూహంతో లాభం కంటే.. న‌ష్ట‌మే ఎక్కువ‌ని చెబుతున్నారు. ఒక రాష్ట్రం గురించి మాట్లాడిన‌ప్పుడు వారి ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేసే క్ర‌మంలో ప‌క్క రాష్ట్ర ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసే అంశాల‌పై మాట్లాడాల్సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో ఇరు రాష్ట్రాల వారిని నొప్పించ‌కుండా మాట్లాడాల‌నే ప్ర‌య‌త్నం.. రెండు రాష్ట్రాల్లోని తెలుగువారిలో సంతృప్తి కంటే అసంతృప్తినే ర‌గిలిస్తుంద‌న్న చిన్న లాజిక్ ను ప‌వ‌న్ మిస్ కావ‌టం ఏమిటి?